మీ ఆయన అప్పు చేస్తే ప్రభుత్వం కడుతుందా?.. ఎమ్మెల్యే బావ కొడుకు దర్పం

ABN , First Publish Date - 2021-12-21T21:16:12+05:30 IST

మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ల భర్తలు అధికారం చెలాయించడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఓ మహిళ ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె బావ కొడుకు ఆమె ముందే పెత్తనం చెలాయించడం నేటి జగన్ ప్రభుత్వంలో చూడొచ్చు.

మీ ఆయన అప్పు చేస్తే ప్రభుత్వం కడుతుందా?.. ఎమ్మెల్యే బావ కొడుకు దర్పం

అనంతపురం: మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ల భర్తలు అధికారం చెలాయించడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఓ మహిళ ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె బావ కొడుకు ఆమె ముందే పెత్తనం చెలాయించడం నేటి జగన్ ప్రభుత్వంలో చూడొచ్చు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, మండల అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అరుణమ్మ అనే మహిళ తనకు ప్రభుత్వ ఇల్లు మంజూరు కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆవేదనను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి తెలియజేస్తుండగా.. తెల్ల చెక్కా వేసుకున్న ఒకతను తానే అక్కడ పెద్దమనిషిని అన్నట్టు సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు. అతడి పేరు ఎర్రిస్వామి రెడ్డి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బావ కొడుకు. రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో సాంబశివారెడ్డి అన్న కుమారుడు. ఎలాంటి అధికారం లేని ఈ సారు వారు మహిళల దగ్గర వినతి పత్రాలు తీసుకుంటూ వాళ్ల సమస్యలు తీర్చే నాయకుడిగా దర్పం ప్రదర్శించాడు. అరుణమ్మ అనే మహిళ తన కష్టాలు చెబుతుంటే.. ‘మీ ఆయన అప్పు చేస్తే ప్రభుత్వం కడుతుందా?’ అంటూ పెద్ద పెద్ద డైలాగులు కూడా విసిరాడు. అంతేకాకుండా ‘ఎమ్మార్వో ఎక్కడున్నాడు?’ అంటూ అధికారులను కూడా తన అదుపులో పెట్టుకున్నట్లు ప్రవర్తించాడు.


మీడియాపై పోలీసుల దౌర్జన్యం

ఎర్రిస్వామిరెడ్డి ప్రశ్నలతో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఆవేదనను మీడియా రికార్డు చేస్తుండగా అక్కడున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బుక్కరాయసముద్రం సీఐ సాయి ప్రసాద్ మీడియాపై దౌర్జన్యానికి దిగారు. మీడియా వాళ్లే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ బుకాయించారు.


ఎర్రిస్వామి రెడ్డి తీరుపై విమర్శలు

ఎలాంటి అధికారం లేకయినా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని దర్పం ప్రదర్శించిన ఎర్రిస్వామి రెడ్డి తీరుపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినతి పత్రాలు స్వీకరించడానికి అతడి ఏం అర్హత ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తన బావ కొడుకును అదుపులో పెట్టాలని సూచిస్తున్నారు.



Updated Date - 2021-12-21T21:16:12+05:30 IST