పీసీసీ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-06-22T23:14:26+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష (టీ పీసీసీ) పదవిని ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని

పీసీసీ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం: జగ్గారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష (టీ పీసీసీ) పదవిని ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్నచిన్న అలకలు సహజమేనని జగ్గారెడ్డి అన్నారు. టీ-పీసీసీ ప్రకటించాక లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్‌లోని చిన్న వ్యత్యాసం మాత్రమే తమ మధ్య ఉంటుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారని సంజయ్‌ కలలు కంటూనే ఉండాలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు చేరుతారని చెప్పడం బీజేపీ బలహీనంగా ఉందని ఒప్పుకోవడమేనని ఆయన అన్నారు. రాష్ట్రం ఇచ్చి కేసీఆర్‌తో కాంగ్రెస్ మాటలు పడాల్సివస్తోందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 



 2018లో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచిపోయారని జగ్గారెడ్డి విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, మైనారిటీ, ఎస్టీల రిజర్వేషన్ పెంచ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి పెన్షన్ ఇవ్వడం లేదని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అప్పుడు ఈ అధికారుల సంగతి చూస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.  సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కొల్లూర్‌లో బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు గూర్ఖాలకంటే అధ్వాన్నంగా పనిచేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. 

Updated Date - 2021-06-22T23:14:26+05:30 IST