Abn logo
Sep 1 2021 @ 13:21PM

బండి సంజయ్‌కి.. జగ్గారెడ్డి సవాల్..

హైదరాబాద్: బీజీపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల కోసం తాను లేవనెత్తిన నాలుగు అంశాలపై చర్చకు సిద్ధమా..  అంటూ ప్రశ్నించారు. ‘‘తెలంగాణలోని 80శాతం హిందువుల కోసం బరాబర్ పని చేస్తానని చెప్పావు.. అలాంటి హిందువుల కోసం మోదీతో మాట్లాడి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించగలవా.. తెలంగాణలో ఉన్న పేద  హిందువులకు.. ప్రధానితో మాట్లాడి రూ.15 లక్షలు ఇప్పించగలవా, తెలంగాణలోని 80 శాతం హిందువుల కోసం మాట మీద నిలబడగలవా.. నిజాం భూములు తీసుకుని హిందువులకు ఇస్తామని చెప్పగలరా..’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రక్తం తాగే పులిలాంటి స్వభావం ఉన్న పార్టీ.. బీజేపీ అని వ్యాఖ్యానించారు. పైకి గోవులా కనపడుతూ హిందువులను రెచ్చగొడుతోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా హిందువులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మతాల మధ్య గొడవలు కావాలా.. లేక ప్రజలకు మేలు జరగాలా.. అంటూ ప్రశ్నించారు. నిజాం భూముల కోసం సంజయ్.. పాతయాత్ర చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.