ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోయింది!

ABN , First Publish Date - 2022-06-30T09:03:26+05:30 IST

‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కుడు కార్యక్రమంతో ఆయన గ్రాఫ్‌ పెరిగిందేమో గానీ.

ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోయింది!

  • గడప బయట అంతా డొల్లే
  • కార్యక్రమానికి వెళ్దామంటే
  • నాయకులు ముఖం చాటేస్తున్నారు
  • కార్యకర్తలకు బిల్లులు ఇప్పించలేదు..
  • మీరొచ్చి ఏం చేస్తారని అంటున్నారు
  • గడపగడపకు వెళ్తే ఛీత్కారాలు
  • రోడ్లు వేశావా.. డ్రెయిన్‌ కట్టావా
  • అంటూ నిలదీస్తున్నారు
  • అవి చేయకుంటే మన పరిస్థితి ఇంతే
  • ప్లీనరీలో దర్శి ఎమ్మెల్యే వేణు స్పష్టీకరణ
  • 10లోగా ఇప్పిస్తానని బాలినేని హామీ


ఒంగోలు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కుడు కార్యక్రమంతో ఆయన గ్రాఫ్‌ పెరిగిందేమో గానీ.. వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌ మాత్రం పడిపోయింది. గడప లోపల ఎలా ఉందో తెలియదు.. కానీ బయటంతా డొల్లే.. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లాలంటే పార్టీ నేతలు, కార్యకర్తలే ముఖం చాటేస్తున్నారు. వద్దు మహాప్రభో అంటున్నారు’ అని దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఆక్రోశించారు. ఒంగోలులో  బుధవారం జరిగిన వైసీపీ ప్రకాశం జిల్లా ప్లీనరీలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. గడపగడపకు వెళ్లాలంటే పార్టీకి చెందిన ఎంపీపీలు, ఇతర ముఖ్యనేతలే ముందుకు రావడం లేదని వాపోయారు. ‘కార్యకర్తలకు రావలసిన బిల్లులే ఇప్పించలేకపోయారు.. ఇక మీరొచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఆయా పనుల నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయించారు. నేను అత్యుత్సాహంతో సజ్జల లాంటి కొంతమంది నాయకుల చుట్టూ తిరిగి మరో రూ.20 కోట్ల పనులు తెచ్చా.. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి చేసుకోమని పురమాయించా. వారు ఎదురుడబ్బులు పెట్టి పనిచేసినా ఇంతవరకు పైసా విడుదల కాలేదు. 


ఇటీవల ఒక గ్రామానికి వెళితే ఓ ముఖ్య కార్యకర్త బయటకు రాలేదు. పైగా ఆయన భార్య ఎదురొచ్చి.. అయ్యా మీరిచ్చిన పని పూర్తిచేసేందుకు మా ఆయన రూ.25 లక్షలు అప్పు తెచ్చాడు.. ఆ డబ్బుకు వడ్డీ కట్టలేక చివరకు ఇల్లు అమ్ముకున్నాం.. ఆయన జనానికి ముఖం చూపలేక ఇంట్లోనే పడుకుంటున్నాడు.. ఇదేనా మీరు మాకు చేసేదంటూ వాపోయింది. ముఖ్యమంత్రే స్వయంగా బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు రాలేదు. అలసత్వం ఎక్కడ జరుగుతోంది? ఏ రకంగా చూసినా దర్శి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు రావలసి ఉంది. పెద్ద నాయకులంతా డబ్బులు ఇప్పించాలి’ అని ఎమ్మెల్యే వేడుకున్నారు. ఇన్ని సమస్యల మధ్య గడప గడపకు వెళ్లి ప్రజలను పలుకరిస్తే వారి నుంచి ఛీత్కారాలే ఎదురవుతున్నాయన్నారు. ఊర్లో ఒక రోడ్డు వేశారా, ఒక డ్రెయిన్‌ కట్టారా అని నిలదీస్తున్నారని తెలిపారు. ‘సీఎంతో పాటు ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరగాలంటే నాలుగు సీసీరోడ్లు వేయడమో, రెండు డ్రెయిన్లు కట్టడమో జరగాలి. లేదంటే మన పరిస్థితి ఇంతే’ అని స్పష్టం చేశారు. దానిని పార్టీ పెద్దలంతా గుర్తించాలని, డబ్బులు వచ్చేలా చేయాలని కోరారు. వచ్చే నెల 10వ తేదీలోగా నిధులు విడుదలయ్యేలా చూస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేదికపై హామీ ఇచ్చారు. అయితే గ్రామాల్లో చేపట్టిన సచివాలయాలు, ఆర్బీకేల భవనాలు పూర్తిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్లు రాకపోవచ్చని వ్యాఖ్యానించారు. కింది స్థాయిలో పరిస్థితిని గుర్తించి రానున్న రెండేళ్లూ మనమంతా కార్యకర్తల కోసం పనిచేద్దామని సూచించారు.

Updated Date - 2022-06-30T09:03:26+05:30 IST