ఏడాదైంది.. అభివృద్ధి ఎక్కడ?

ABN , First Publish Date - 2020-06-04T09:17:00+05:30 IST

‘‘నేను ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిపోయింది. కానీ.. నా నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి పని చేపట్టలేదు. సీఎం జగన్‌ చేసిన సిఫారసులకు దిక్కులేకుండా

ఏడాదైంది.. అభివృద్ధి ఎక్కడ?

  • వెంకటగిరిని పాలకులు మరిచిపోయారా?
  • రాష్ట్రం నుంచి దీనిని తొలగించారా? 
  • నియోజకవర్గంలో ఏడాదిగా పని జరగలేదు
  • 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో 
  • ఇలాంటి పరిస్థితిని చూడలేదు
  • మారకపోతే పోరాటం తప్పదు
  • అధికారులు, పాలకులపై ఎమ్మెల్యే ఆనం ఫైర్‌


నెల్లూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిపోయింది. కానీ.. నా నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి పని చేపట్టలేదు. సీఎం జగన్‌ చేసిన సిఫారసులకు దిక్కులేకుండా పోయింది. తాగునీరు సహా అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు ఏమైపోయాయో అంతుచిక్కడం లేదు. అసలు వెంకటగిరి నియోజకవర్గం ఉందా? తీసేశారా? లేక, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, పాలకులు మరచిపోయారా?’’ అని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బుధవారం వెంకటగిరిలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆనం మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడి నుంచి గెలవడం వెంకటగిరి ప్రజలకు శాపంగా మారిందా? నామీద కక్షకట్టి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. సాగునీటి కోసం ఎస్‌ఎస్‌ కెనాల్‌ ప్రాజెక్టుకు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయో అంతుపట్టడం లేదన్నారు. సాక్షాత్తు సీఎం జగన్‌ ఈ నివేదికపై సంతకం చేసి పరిశీలించమని ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. వెంకటగిరిలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాల కోసం మున్సిపల్‌ మంత్రిని కోరామని, ఆయన సూచన మేరకు తయారు చేసిఇచ్చిన డీపీఆర్‌ ఏమైందో మంత్రికే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 


మండలాలకు తాగు, సాగునీటి కోసం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రికి ఇచ్చిన నివేదిక ఎటు పోయిందో అంతుపట్టడం లేదన్నారు. కండలేరు నుంచి తాగునీరు విడుదల కుదరదని అధికారులు చెప్పినట్లు తెలిపారు. తెలుగుగంగ కాలువకు 1290క్యూసెక్కులు వదులుతుంటే తమిళనాడు సరిహద్దుకు 290క్యూసెక్కులు మాత్రమే చేరుతోందన్నారు. మిగిలిన వెయ్యి క్యూసెక్కులు ఎక్కడికి పోతున్నాయి? ఎవరికి అమ్ముకొంటున్నారు? అని అధికారులను ప్రశ్నించారు. ‘‘కాలువకు ఎగువన వెంకటగిరి ఉంది. మేం నీటిని వాడుకోవాలనుకుంటే అడ్డుకోగలరా? జిల్లా అధికారులు, తెలుగు గంగ అధికారులు కాపలా కాయగలరా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీ జోబులు నింపే వారికోసం, మీ అడుగులకు మడుగులొత్తేవారి కోసం ఇష్టంవచ్చినట్లు నీరు వదులుకొని, వెంకటగిరి ప్రజలకు తాగునీరు లేకుండా చేస్తారా?’’ అని నిప్పులు చెరిగారు. చెరువులకైనా నీరు వదులుతారా? మమ్మల్నే తీసుకోమంటారా? అని ప్రశ్నించారు. ‘‘జిల్లాలో జరుగుతున్న జల దోపిడీని అరికట్టండి. వెంకటగిరి చెరువులకు పాతిక భాగం నీరు ఇవ్వండి’’ అని డిమాండ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే వెంకటగిరిలో మాత్రం జరగడం లేదన్నారు. ‘‘జిల్లా నుంచి వెంకటగిరిని మైనస్‌ చేశారా? అప్పుడే డీలిమిటేషన్‌ చేసేశారా? నా 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంతలా కళ్లమూసుకుని కూర్చున్న అధికారులను ఎప్పుడూ చూడలేదు. ఇకనైనా కళ్లుతెరిచి వెంకటగిరికి న్యాయంచేయండి. లేని పక్షం లో పోరాటాలకు వెనుకాడను’’ అని ఆనం హెచ్చరించారు.

Updated Date - 2020-06-04T09:17:00+05:30 IST