హాట్ టాపిక్‌గా మారిన YSRCP MLA వ్యవహారం.. ఆయన చెప్పిందే వేదం.. లేదంటే అంతే సంగతులట!

ABN , First Publish Date - 2022-02-05T16:29:18+05:30 IST

ప్రకాశం జిల్లాలో కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారని

హాట్ టాపిక్‌గా మారిన YSRCP MLA వ్యవహారం.. ఆయన చెప్పిందే వేదం.. లేదంటే అంతే సంగతులట!

ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌పై ఆ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారా? ఆ ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి వారు ఏమని ఫిర్యాదులు చేశారు? తమ ఎమ్మెల్యే వ్యవహారం ఏంటో చూడాలని వారు పార్టీ అధిష్టానానికి మొర పెట్టుకోవడం వెనుక అసలు కథేమిటి? ఇంతకీ కనిగిరి వైసీపీలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌పై ఎలాంటి చర్చ జరుగుతోంది? వివరాలు ఈ కథనంలో చూద్దాం. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


మధుసూదన్ వ్యవహారం హాట్ టాపిక్‌

ప్రకాశం జిల్లాలో కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారని తెలిస్తే చాలు... వారిని వెంటాడి మరీ వేధిస్తున్నారట. ప్రతిపక్షమైనా, అధికార పార్టీ నాయకులైనా ఎవరినీ వదిలిపెట్టడం లేదట. దీంతో ఎమ్మెల్యే బుర్రా బారి నుండి తమను కాపాడాలంటూ కనిగిరి వైసీపీ నాయకులు తాడేపల్లికి క్యూ కడుతున్నారని చర్చ జరుగుతోంది.


బుర్రా మధుసూదన్ చెప్పిందే వేదం..

బెంగళూరులో బిల్డర్‌గా ఉన్న బుర్రా మధుసూదన్ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ హవా వీయడంతో బుర్రా మధుసూదన్‌ను ఎమ్మెల్యే పదవి వరించింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లకే ఆయన నుండి తమను కాపాడాలంటూ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు అధికార పార్టీ ముఖ్య నాయకుల్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 


కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ చెప్పిందే వేదం, చేసిందే చట్టంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసు, రెవెన్యూ అధికారులతో వారిని వెంటాడి వేస్తున్నారట. తాజాగా హనుమంతునిపాడు వైసీపీ జడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్... తనను ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వేధిస్తున్నారని జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించడం హాట్‌టాపిక్‌గా మారింది. 


ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు తాను 60 లక్షలు అప్పుగా ఇచ్చాననీ, అది తిరిగివ్వాలని అడిగినందుకే ఆయన తనను టార్గెట్‌ చేశారనీ మంత్రి బాలినేనికి దద్దాల నారాయణ యాదవ్‌ ఫిర్యాదు చేశారట. ఈ విషయంగా ఎమ్మెల్యే బుర్రాతో మంత్రి బాలినేని చర్చలు జరిపినా ఆయన వినిపించుకోలేదట. హనుమంతునిపాడు వైస్ ఎంపీపీ ఎంపిక విషయంలో తనను సంప్రదించలేదని ఎమ్మెల్యే బుర్రాను దద్దాల నారాయణ యాదవ్‌ ప్రశ్నించడమే వివాదానికి అసలు కారణమని సమాచారం.


మధుసూదన్‌కు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గం వైసీపీ శ్రేణులు

ఇదిలాఉంటే, కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం వైసీపీ శ్రేణులు ఓ గ్రూప్ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బుర్రా తాజాగా తన సొంత సామాజికవర్గానికి చెందిన జడ్పీటీసీ నారాయణ యాదవ్‌పై కేసులు పెట్టించడం జిల్లాలో చర్చనీయాంసంగా మారింది. అయితే ఎమ్మెల్యే బుర్రా వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు జడ్పీటీసీ నారాయణ యాదవ్‌ సైతం సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన మరో వర్గాన్ని తయారు చేసుకుంటున్నారట. త్వరలో పార్టీ అధిష్టానం వద్దే పంచాయితీ పెడతారని సమాచారం.


ఏదిఏమైనా కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నరేళ్లకే ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో బలంగా ఉన్న రెండు సామాజిక వర్గాల వారు గ్రూపులుగా మారడం వైసీపీకి తలనొప్పిగా మారింది. కనిగిరిలో ప్రత్యేక పాలన సాగిస్తున్న ఎమ్మెల్యే బుర్రా వ్యవహారం అధికార వైసీపీకి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. మరి ఈ విషయంలో వైసీపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Updated Date - 2022-02-05T16:29:18+05:30 IST