తిరుమలపై మంత్రి కొడాలి వ్యాఖ్యలు సిగ్గుచేటు: కొండపి ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-09-22T18:33:03+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్ధాన నిబంధనలపై ఒక బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి కొడాలి నాని బాధ్యతారాహిత్యంగా

తిరుమలపై మంత్రి కొడాలి వ్యాఖ్యలు సిగ్గుచేటు: కొండపి ఎమ్మెల్యే

ప్రకాశం: ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్ధాన నిబంధనలపై ఒక బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి కొడాలి నాని బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటని కొండపి ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు బాల వీరాంజనేయ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు వచ్చే అన్యమతస్థులకు దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనలు ఎప్పటి నుండో ఉందని చెప్పారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పుత్ర వాత్సల్యంతో సీఎం జగన్‌ కోసం తిరుమలలో డిక్లరేషన్‌ నిబంధనలు అవసరం లేదని, సంతకం పెట్టాల్సిన పని లేదంటున్నారని  మండిపడ్డారు.


సీఎం జగన్‌ తిరుమలలో దేవుడికి మొక్కుకుని ఇడుపులపాయ వెళ్లి ప్రార్ధనలు చేస్తూ కూర్చుంటారని... వైఎస్ విజయమ్మ ఎప్పుడు చేతిలో బైబిల్‌‌తోనే కనిపిస్తారని అన్నారు. మంత్రి కొడాలి నాని తిరుమలకు వెళ్లే వారికి డిక్లరేషన్‌లు అవసరమా అని... ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి విరిగితే నష్టమా అని... కనకదుర్గమ్మ గుడిలో సింహాలు పోతే నష్టమా అంటూ.. అంతర్వేధిలో రధం తగలబడితే ఏమవుతుంది అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుమల దర్శనానికి వచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, సోనియా గాంధీ కూడా డిక్లరేషన్‌పై సంతకాలు చేసిన తర్వాతే దర్శనం చేసుకున్నారని గుర్తుచేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ పెద్ద మనస్సుతో తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్‌ మీద సంతకం చేస్తే ప్రజలందరూ హర్షిస్తారని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ తెలిపారు. 

Updated Date - 2020-09-22T18:33:03+05:30 IST