అమరావతి: పోలీసుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్కు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. పోలీసులపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కానిస్టేబుల్, ఎస్సై స్థాయి అధికారులు రెండున్నరేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. సైనికుల్లా రేయింబవళ్లు సేవలందిస్తున్న సిబ్బందికి డిఏ, టీఏ సకాలంలో ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో.. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీక్లీ ఆఫ్ అమలుపై నివేదిక సమర్పించి రెండేళ్లవుతున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కానిస్టేబుల్స్, ఏఎస్సై, ఎస్సైలకు పదోన్నతులు లేవని, అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖలోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారని, ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం లేదని, పెన్షనర్లకు పెన్షన్లు అందడం లేదని, ఇవన్నీ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేతనాలు, పెన్షన్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అనగాని ఆ లేఖలో పేర్కొన్నారు.