మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌!

ABN , First Publish Date - 2021-06-29T17:48:02+05:30 IST

ఇప్పటికే మనలో ఎంతోమంది ఒకే వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసులు తీసుకున్నాం. అయితే మొదటి డోసు ఒక రకం వ్యాక్సిన్‌, రెండవ డోసు మరో రకం వ్యాక్సిన్‌ తీసుకునే మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌

మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌!

ఆంధ్రజ్యోతి(29-06-2021)

ఇప్పటికే మనలో ఎంతోమంది ఒకే వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసులు తీసుకున్నాం. అయితే మొదటి డోసు ఒక రకం వ్యాక్సిన్‌, రెండవ డోసు మరో రకం వ్యాక్సిన్‌ తీసుకునే మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ ఇనాక్యులేషన్‌ విధానం తాజాగా ఊపందుకుంటోంది. జర్మనీ ఛాన్సెలర్‌, 66 ఏళ్ల ఏంగెలా మెర్కెల్‌ రెండు వేర్వేరు షాట్స్‌ తీసుకోవడంతో మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సినేషన్‌, దాని ప్రభావాల గురించిన చర్చలు మొదలయ్యాయి.


ఇప్పటికే కొన్ని దేశాలు ఈ తరహా వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తుంటే, మరికొన్ని దేశాలు తమ ప్రజలను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో నిర్దిష్ట వ్యాక్సిన్ల కొరత కారణంగా, తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇలా రెండు భిన్న వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా అదనంగా పొందే ప్రయోజనాల గురించిన లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు, హెల్త్‌ పాలసీ మేకర్లు ఒకే వ్యక్తి రెండు వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందే వీలుందని అంటున్నారు.


‘హెటిరోలోగస్‌ ప్రైమ్‌బూట్‌’ అని శాస్త్రవేత్తలు పిలిచే మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సినేషన్‌ విధానం కొత్తదేమీ కాదు. ఎబోలాతో సహా ఇతరత్రా వ్యాధుల నివారణ కోసం ఇదే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. రెండు వేర్వేరు వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా దృఢమైన రోగనిరోధకశక్తిని ఇమ్యూనిటీ రెస్పాన్స్‌ను సాధించే వీలుంది. అలాగే భిన్నమైన వ్యాక్సిన్లు, వ్యాధినిరోధకవ్యవస్థలోని వేర్వేరు ప్రాంతాలను ప్రేరేపించి, వేర్వేరు మార్గాల్లో దాడి చేసే వైర్‌సలను గుర్తుపట్టగలిగేలా వ్యాధినిరోధక వ్యవస్థకు శిక్షణనిస్తాయి.


క్లినికల్‌ ట్రయల్స్‌

మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సినేషన్‌తో ఒరిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించిన ట్రయల్స్‌ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు, ఆస్ట్రాజెంకా-ఆక్స్‌ఫర్డ్‌, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, మోడర్నా-నోవావాక్స్‌ మొదలైన వేర్వేరు వ్యాక్సిన్‌ కాంబినేషన్లను పరిశీలిస్తున్నారు. రష్యన్‌ శాస్త్రవేత్తలు స్పుత్నిక్‌-ఆస్ట్రాజెంకా మిశ్రమ వ్యాక్సిన్లను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. నిజానికి రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తయారీ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ విధానం ద్వారానే తయారైంది. దీని రెండు డోసుల ఫార్ములాలు భిన్నమైనవి. ఈ విధానం గురించి మరిన్ని అధ్యయనాలు జరపవలసి ఉన్నప్పటికీ, మిక్స్‌డ్‌ వ్యాక్సిన్ల ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో ఈ తరహా వ్యాక్సినేషన్‌ పట్ల ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.


ఆస్ట్రాజెంకా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకుని, రెండవ డోసుగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తుల్లో ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ అత్యధికంగా ఉంటున్నట్టు స్పానిష్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ అందిన డాటా ప్రకారం ఈ తరహా వ్యాక్సినేషన్‌తో తలనొప్పి, జ్వరం, నిస్సత్తువ లాంటి దుష్ప్రభావాల తీవ్రత ఒకింత ఎక్కువగా ఉంటుందని స్పష్టమైంది. 




Updated Date - 2021-06-29T17:48:02+05:30 IST