ముంబైని దారుణంగా దెబ్బతీసిన అమిత్ మిశ్రా.. ఢిల్లీ ఎదుట స్వల్ప లక్ష్యం

ABN , First Publish Date - 2021-04-21T03:02:18+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది...

ముంబైని దారుణంగా దెబ్బతీసిన అమిత్ మిశ్రా.. ఢిల్లీ ఎదుట స్వల్ప లక్ష్యం

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణయం ఎంత తప్పో క్రీజులోకి వచ్చాక కానీ ఆ జట్టుకు తెలియరాలేదు. 9 పరుగులకే ఓపెనర్ డికాక్ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. మూడు సిక్సర్లు బాది రోహిత్ దూకుడు మీదున్నట్టు కనిపించాడు. ఈ క్రమంలో 15 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో పంత్‌కి చిక్కి అవుటయ్యాడు.


సూర్యకుమార్ అవుట్‌తో ముంబైకి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ అవుటయ్యాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో మరింత పట్టుబిగించిన ఢిల్లీ వరుసపెట్టి వికెట్లు తీస్తూ ముంబైని ఒత్తిడిలోకి నెట్టేసింది. ఇంకోవైపు, అమిత్ మిశ్రా మరింత రెచ్చిపోయాడు. హార్దిక్ పాండ్యాను గోల్డెన్ డక్ చేసిన మిశ్రా అదే ఊపులో కీరన్ పొలార్డ్ (2), ఇషాన్ కిషన్ (26)లను పెవిలియన్ పంపాడు. అవేష్ ఖాన్ రెండు, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. జయంత్ యాదవ్ కాసేపు పోరాడి 23 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

Updated Date - 2021-04-21T03:02:18+05:30 IST