అలా నా ఒక్కదానికే జరగలేదే!

ABN , First Publish Date - 2020-08-14T08:46:11+05:30 IST

వెస్టిండీ్‌సలో జరిగిన 2018 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు వెటరన్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను భారత తుది జట్టు నుంచి తప్పించడం వివాదాస్పదమైంది...

అలా నా ఒక్కదానికే జరగలేదే!

  • టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌ నుంచి 
  • తప్పించడంపై మిథాలీ రాజ్‌

న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సలో జరిగిన 2018 మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు వెటరన్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను భారత తుది జట్టు నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. టోర్నీ ముగిసిన తర్వాత తనను టీమ్‌ నుంచి తప్పించడంపై మిథాలీ తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పటి కోచ్‌ రమేష్‌ పొవార్‌, బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ తన కెరీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నారని నిప్పులు చెరిగింది. అయితే, ఆనాటి చేదు జ్ఞాపకాలను స్టార్‌ స్పోర్ట్స్‌-1 తెలుగు షో ‘సరిలేరు మీకెవ్వరు’లో రాజ్‌ మరోసారి గుర్తు చేసుకొంది. ‘తుది జట్టు నుంచి తప్పించడంతో తీవ్ర నిరాశకు లోనయ్యా. కానీ, అలా జరిగింది నాకొక్క దానికే కాదుగా. క్రీడాకారుల జీవితంలో ఇలాంటివి సహజం.


జట్టు కూర్పులో భాగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నా కంటే మెరుగైన ప్లేయర్లు ఉన్నారని కెప్టెన్‌, కోచ్‌ భావించి ఉంటార’ని మిథాలీ చెప్పింది. ఒకవేళ సెమీ్‌సలో టీమిండియా నెగ్గి ఉంటే.. ఫైనల్లో తనకు ఆడే అవకాశం దక్కేదేమోనని అభిప్రాయపడింది. అప్పుడు భారత్‌ను విజేతగా నిలిపేందుకు శాయశక్తులా పోరాడి ఉండే దానినని చెప్పింది. మిథాలీ జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ నిర్మితమవుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటి తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే, కవర్‌ డ్రైవ్‌లు ఆడడంలో తాప్సీకి తాను శిక్షణ ఇస్తున్నట్టు రాజ్‌ తెలిపింది. ‘తాప్సీ ఎంతో చలాకీగా ఉంటుంది. సాయం కోరినప్పుడు కొంత సమయం కావాలని అడిగా. ముఖ్యంగా కవర్‌ డ్రైవ్‌ల విషయంలో ఎక్కువగా పోల్చుతారు. కాబట్టి ఆ షాట్లపైనే ఎక్కువగా దృష్టి సారించాలని సూచించాన’ని మిథాలీ చెప్పింది.


Updated Date - 2020-08-14T08:46:11+05:30 IST