మాట తప్పడం..మడమ తిప్పడం జగన్‌ నైజం

ABN , First Publish Date - 2022-06-27T04:57:31+05:30 IST

ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ విషయంలోనూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మడమ తిప్పడం... మాట తప్పడం తన నైజమని మరోసారి నిరూపించారని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు.

మాట తప్పడం..మడమ తిప్పడం జగన్‌ నైజం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల లక్ష్మీప్రసన్న

 తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల లక్ష్మీప్రసన్న

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 26 : ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ విషయంలోనూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మడమ తిప్పడం... మాట తప్పడం తన నైజమని మరోసారి నిరూపించారని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది ఒంటరి మహిళలు ఉన్నారని, వారికి ఇచ్చే పెన్షన్‌లోనూ తిరకాసు పెడుతూ 50 ఏళ్లు దాటితే తప్ప పెన్షన్‌ ఇవ్వలేమని చెప్పడం దుర్మార్గమన్నారు. ఆనాడు పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని,ఎన్నో హమీలిచ్చి, ఇపుడు అధికారంలోకి వచ్చిన వాటిని తుంగలో తొక్కుతూ మాట మార్చడం మహిళలను దగా చేయడమే అవుతుందన్నారు. కరోనా సమయంలో ఎంతో మంది కుటుంబాలను కోల్పోయి ఒంటరి మహిళలుగా మిగిలిపోయారన్నారు. వారికి ఇపుడు ఎలాంటి ఉపాధి లేక, పెన్షన్‌ ఇవ్వక ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తాను తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది ఒంటరి మహిళలు రోడ్డున పడతారనే విషయం సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. మహిళల పక్షపాతినని చెప్పుకునే జగన్‌ మహిళాసాధికారతకు ఏమి కృషి చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పల్లెల్లో 30 ఏళ్లు, పట్టణాల్లో 35 ఏళ్లు దాటిన మహిళలకు ఎంతో సాయం అందిందన్నారు. ఆ సాయాన్ని జగన్‌ తీసేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. యథాప్రకారం ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇవ్వాలని, లేనిపక్షంలో మహిళలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వై.ఝాన్సీ,  జిల్లా కార్యదర్శి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T04:57:31+05:30 IST