ఆంధ్రజ్యోతి(29-03-2022)
మొదటిసారి అయినా, ఏళ్ల తరబడి కొనసాగుతున్నా నెలసరికి అలవాటు పడే పరిస్థితి ఉండదు. ప్రతి మహిళా ఆ మూడు రోజులూ ఎంతో కొంత అసౌకర్యాన్ని భరించక తప్పదు. అయితే ఆ అసౌకర్యం మరింత ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, కొన్ని అలవాట్లు అలవరుచుకోవాలి, కొన్నిటిని వదిలించుకోవాలి.
ఎక్కువ సమయం వద్దు: టాంపూన్ లేదా ప్యాడ్ ఏదైనా తరచూ మారుస్తూ ఉండాలి. ప్యాడ్‌ను ప్రతి 4 నుంచి 6 గంటలకూ, టాంపూన్ను ప్రతి రెండు నుంచి మూడు గంటలకోసారి మారస్తూ ఉండాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు తప్పవు.
ఆ వాష్‌లు వద్దు: వెజైనల్ వాష్లను వాడడం వల్ల పిహెచ్ బ్యాలెన్స్ అదుపు తప్పి, ఇన్ఫెక్షన్లకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లతో మాత్రమే శుభ్రం చేసుకోవాలి.
వ్యాక్సింగ్ వద్దు: నెలసరి సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ చురుగ్గా ఉంటుంది. కాబట్టి చిన్న దెబ్బ కూడా ఎక్కువ బాధను కలిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాక్సింగ్, దంత చికిత్స లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మేలు.
ఈ ఆహారం వద్దు: నెలసరి సమయంలో ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ మీదకు మనసు మళ్లుతుంది. కానీ ఈ సమయంలో అలాంటివి తినడం వల్ల ఒంట్లో నీళ్లు నిలిచిపోయి, అసౌకర్యం రెట్టింపవుతుంది.