‘మంచు’ ముప్పు!

ABN , First Publish Date - 2022-01-24T05:16:29+05:30 IST

‘మంచు’ ముప్పు!

‘మంచు’ ముప్పు!
అపరాల పంటపై మంచు ప్రభావం

- గత ఐదురోజులుగా కప్పేస్తున్న పొగమంచు

- పూత దశలో అపరాలు, జీడి, మామిడి

- నష్టం తప్పదని రైతుల్లో ఆవేదన 

(పాలకొండ)

అన్నదాతల రబీ ఆశలపై పొగమంచు నీళ్లు చల్లుతోంది. కొద్దిరోజులుగా జిల్లాను పొగమంచు కుమ్మేస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంది. దీంతో జీడి, మామిడి, పెసర, మినుము, మొక్కజొన్న పంటలపై ప్రతాపం చూపుతోంది. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉండడంతో నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో తెగుళ్లు, తుపాన్లు పంటలను నాశనం చేశాయి. దిగుబడులు అమాంతం తగ్గిపోయాయి. పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రబీపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వాతావరణ ప్రతికూల పరిస్థితులు వెంటాడుతుండడంతో నష్టం తప్పదని రైతులు భావిస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్‌లో వరి వేసిన తరువాత కోతలకు కొద్దిరోజుల ముందే పొలాల్లో పెసర, మినుము చల్లుకుంటారు. ఈ లెక్కన డిసెంబరు తొలివారంలో ఎక్కువ మంది వీటిని చల్లారు. ప్రస్తుతం పెసర, మినుము మొక్కలు మొలిచాయి. అక్కడక్కడ పిందె సైతం కడుతోంది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న మంచు పూతపై ప్రభావం చూపుతోంది. పిందె మాడిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతర పంటగా పెసర, మినుము పండితేనే రైతులకు కొంత గిట్టుబాటు ఉంటుంది. కానీ ఈ ఏడాది మంచు కారణంగా పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఉద్దాన, మైదాన ప్రాంతాల్లోని జీడి, మామిడి పంటకు కూడా పొగ మంచు వల్ల నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం జీడి, మామిడి పూత దశలో ఉన్నాయి. ఈ దశలో మంచుపడితే పూతకు ప్రమాదం. మాడిపోయే అవకాశం ఉంది. దీంతో రైతులు తల్లడిల్లుతున్నారు. తితలీ తుపాను తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జీడి రైతులకు పొగమంచు దడ పుట్టిస్తోంది. జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలు సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు రోజంతా మబ్బులు, సాయంత్రం నుంచి ఉదయం వరకూ పొగమంచుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకూ పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. 

Updated Date - 2022-01-24T05:16:29+05:30 IST