అదే జరిగితే మిషన్ గంగా ఫెయిల్..!

ABN , First Publish Date - 2022-03-06T00:18:44+05:30 IST

ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ స్టేట్ యూనివర్శిటీలో చిక్కుకుపోయిన 800 మందికి పైగా విద్యార్థులు భారత ప్రభుత్వానికి..

అదే జరిగితే  మిషన్ గంగా ఫెయిల్..!

సుమీ: ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ స్టేట్ యూనివర్శిటీలో చిక్కుకుపోయిన 800 మందికి పైగా విద్యార్థులు భారత ప్రభుత్వానికి శనివారం తమ గోడు విన్నవించుకున్నారు. సురక్షితంగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని కోరారు. ప్రాణాలకు తెగించి శనివారం ఉదయం ఉక్రెయిన్ సరిహద్దుల వైపు వీరంతా నడక సాగించారు. ఇకెంత మాత్రం భారత ప్రభుత్వ సేఫ్టీ ఎస్కార్ట్‌ కోసం ఎదురుతెన్నులు చూడలేమని, అందుకే ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల వైపు వెళ్తున్నామని విద్యార్థులు ఒక వీడియోలో తమ ఆవేదన వినిపించారు.


తోటి విద్యార్థులతో కలిసి రష్యా సరిహద్దుల వైపు వెళ్తున్న ఓ విద్యార్థిని ఈ వీడియోలా తమ తాజా పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించింది. ''మేము సుమీ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థులం. యుద్ధం మొదలై ఇప్పటికి పది రోజులైంది. రెండు సిటీల్లో హ్యుమనటేరియన్ కారిడార్లు తెరిచేందుకు రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటించినట్టు విన్నాం. వాటిలో  ఒకటి మరియుపోల్‌. అది సుమీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం నుంచి కాల్పులు, బాంబులు మోతలు, స్ట్రీట్ ఫైట్ శబ్దాలు వినిపిస్తున్నాయి. చాలా భయంగా ఉంది. ఇంతవరకూ మేము ఎంతగానో నిరీక్షిస్తూ వచ్చాం. ఇక నిరీక్షించడం మా వల్ల కాదు. మేము మా ప్రాణాలతో రిస్క్ చేయడానికే సిద్ధపడ్డాం. సరిహద్దుల వైపు వెళ్తున్నాం. మాకేదైనా జరిగితే దానికి ప్రభుత్వం, ఇండియా రాయబార కార్యాలయానిదే బాధ్యత. మాలో ఏ ఒక్కరికి ఏది జరిగినా మిషన్ గంగా అతిపెద్ద ఫెయిల్యూర్ కిందే లెక్క'' అని ఆ విద్యార్థిని వీడియోలో పేర్కొంది.


ఇదే మా చివరి వీడియో...

మరో విద్యార్థిని మాట్లాడుతూ...''సుమీ స్టేట్ యూనివర్శిటి విద్యార్థుల చివరి వీడియో ఇదే. మేము ప్రాణాలకు తెగించి రష్యా తెరిచిన సరిహద్దు వైపు వెళ్తున్నాం. ఇదే మా చివరి అభ్యర్థన. చివరి వీడియో కూడా. మా కోసం ప్రార్థించండి. సొంత రిస్క్ మీదే ముందుకు వెళ్తున్నాం'' అని పేర్కొంది. మరో స్టూడెంట్ బిగ్గరగా కేకలు వేస్తూ ''ఇప్పటికిప్పుడు మాకు ప్రభుత్వ సాయం కావాలి'' అని డిమాండ్ చేసింది. ఆ వెంటనే ''భారత్ మాతా కీ జై'' అంటూ  నినదించింది.

Updated Date - 2022-03-06T00:18:44+05:30 IST