పర్యావరణ హితానికి పెద్దఎత్తున మొక్కల పెంపకం
స్వచ్ఛంద సంస్థలు, ప్రజలకు భాగస్వామ్యం
ఔషధ, అటవీ ఉత్పత్తుల మొక్కలకు ప్రాధాన్యం
బృహత్తర ప్రణాళితో సిద్ధమైన అటవీ శాఖ
నగరంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): పుష్కలమైన అటవీసంపద, అరుదైన వన్యప్రాణులున్న తూర్పు కనుమల పరిరక్షణ కోసం అటవీశాఖ బృహత్తర ప్రణాళిక రూపొందించింది. ‘మిషన్ తూర్పుకనుమలు’ పేరిట భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా నగరంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో గల అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున మొక్కలను నాటి, పెంచడంతో పాటు సంరక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అంతేకాక ఇందులో ప్రజలకు భాగస్వామ్యం కల్పించనున్నారు.
ఎంపిక చేసిన మొక్కలతో...
ఔషధ, అరుదైన, అటవీ ఉత్పత్తులు లభించే మొక్కల పెంపకంతో గిరిజనులకు జీవనోపాధి కల్పించడం... మరోవైపు నగరంలో పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా మిషన్ పనిచేయనున్నది. విత్తన సేకరణ, నర్సీరీల్లో మొక్కలపెంపకం, చెట్లను దత్తత తీసుకోవడం, పండ్ల జాతి మొక్కల పెంపకంలో ఔత్సాహికులు, సంస్థలకు భాగస్వామ్యం కల్పించనున్నారు. విశాఖ మన్యం, నగర పరిసరాల్లో అడవులు, కొండలు తూర్పు కనుమల్లో భాగమే.. అందువల్ల మిషన్ తూర్పుకనుమలుగా ప్రాజెక్టుకు నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను విశాఖ డివిజనల్ అటవీ అఽధికారి అనంత్‌శంకర్ శనివారం నగరానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. ప్రజలకు సేంద్రియ అటవీ ఉత్పత్తులను అందించడంతోపాటు నాన్ టింబర్ అడవుల పెంపకం చేపట్టాలని మిషన్‌లో ప్రతిపాదించామన్నారు. తద్వారా గిరిజనులకు సుస్థిర ఆదాయం లభించనున్నదన్నారు.
జీవరాశుల పరిరక్షణకు చర్యలు
తూర్పుకనుమల్లో ఉన్న అన్ని రకాల జీవరాశులు, అరుదైన, ఔషధ మొక్కలపై సర్వే చేస్తామని ఆయన వివరించారు. కంబాలకొండలో జీవ వైవిధ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు నగరంలో డాల్ఫిన్ నేచుర్ సొసైటీ, రాజమండ్రికి చెందిన స్టేట్ సిల్వికల్చరిస్టు సొసైటీని భాగస్థులను చేశామన్నారు. ఈ కేంద్రం ద్వారా వెదురు తోటల పెంపకం, ఔషధమొక్కలు, హెర్బల్ ప్లాంట్లు, సీతాకోకచిలుక పార్కు నిర్వహణ చేపడతామన్నారు. రాష్ట్రంలో ఇటువంటి సంస్థ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని వివరించారు. తూర్పు కనుమల్లో అరుదైన జీవులు, చెట్లను కాపాడేందుకు ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అరుదుగా లభించే సుమారు 125 రకాల మొక్కలను సేకరించి సంరక్షించడానికి ఆధునిక నర్సరీలు కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు
నగరంలో కాలుష్య నియంత్రణే ధ్యేయం
నగరంలో ఇటీవల కాలుష్యం దారుణంగా పెరిగిపోతోంది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందువల్ల నగరం, పరిసరాల్లో భారీగా మొక్కల పెంపకం చేపట్టడంతో ఉష్ణోగ్రతలు కొంతవరకు అదుపుచేయవచ్చునన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంపై ఫోకస్ పెడతామని వివరించారు. విశాఖపై తుఫాన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీనిని తట్టుకునేలా తీర ప్రాంతంలో చెట్ల పెంపకంతో తుఫాన్ తీవ్రతను నియంత్రిచవచ్చని వివరించారు.