గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడం లేదు

ABN , First Publish Date - 2022-09-25T05:12:26+05:30 IST

పలు గ్రామాల్లో మిషన్‌భగీరథ నీరు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు పలువురు వాపోయారు.

గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడం లేదు
సమస్యలపై అధికారులను నిలదీస్తున్న సర్పంచులు

మండల సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలను ప్రస్తావించిన సభ్యులు 

శివ్వంపేట, సెప్టెంబరు 24: పలు గ్రామాల్లో మిషన్‌భగీరథ నీరు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు పలువురు వాపోయారు. శనివారం ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన జరగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. విద్యుత్‌ అధికారులు మరమ్మతులకు ఎల్‌సీ ఇవ్వకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచులు ఫిర్యాదు చేశారు. ‘మన ఊరు-మనబడి’లో భాగంగా మండలంలో 26 పాఠశాలలను ఎంపిక చేసి నిధులు కేటాయించినా.. పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. నవాబుపేట నుంచి పోతులబోగుడ వరకు రోడ్డు పనులకోసం నిధులు మంజూరై నెలలు గడస్తున్నా పనులు కావడం లేదని పలువురు సమావేశంలో ప్రస్తావించగా ఏఈ ఇందుకు స్పందిస్తూ ఆరు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెప్పారు. శివ్వంపేటలో కళాశాల నిర్మాణం కోసం నిధులు ఉన్నా స్థలం కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీటీసీ దశరథ తెలిపారు. మండలంలో కోతుల దాడులతో పలు గ్రామాల్లో ప్రజలు గాయాలకు గురవుతున్నందున పీహెచ్‌సీలో టీకాలు అందుబాటులో ఉంచాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దగొట్టిముక్ల పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని సర్పంచ్‌ చంద్రకళశ్రీశైలం కోరారు. సమాచారం లేకుండా సమావేశానికి గైర్హాజరైన ఏవోకు మెమో జారీ చేయాలని ఎంపీపీ హరికృష్ణ ఆదేశించారు. సమావేశంలో జడ్పీ కో-ఆప్షన్‌ మన్సూర్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు రమాకాంత్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సచారి, ఇన్‌చార్జి ఎంపీడీవో తిరుపతిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T05:12:26+05:30 IST