మిషన్‌ స్లో!

ABN , First Publish Date - 2022-06-05T05:34:21+05:30 IST

ఇంటింటికీ తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన మిషన్‌ భగీరథ పథకం పనులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మెల్లగా సాగుతున్నాయి.

మిషన్‌ స్లో!
ఓ ఇంటిలోని సంప్‌లో నీరు నింపుతున్న ట్యాంకర్‌

  • ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మందకొడిగా మిషన్‌ భగీరథ పనులు
  • నీటి కోసం పట్టణ ప్రజల ఇక్కట్లు
  • రూ.40.35కోట్లతో చేపట్టిన పనులు
  • పూర్తయ్యేందుకు మరో రెండు నెలలు!
  • రోడ్ల తవ్వకాలతో వాహనదారుల ఇక్కట్లు

ఇంటింటికీ తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన మిషన్‌ భగీరథ పథకం పనులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మెల్లగా సాగుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ప్రారంభంలోనే చేతులెత్తేయడంతో మరో కంపెనీకి పనులు కట్టబెట్టారు. పైప్‌లైన్‌ పనులు పూర్తికావచ్చినా ఇళ్లకు నల్లా కనెక్షన్‌, నీటి సరఫరా ప్రారంభంకాక నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ప్రజలు వాటర్‌ ప్లాంట్ల నీటిని కొనుక్కుంటున్నారు. వాడుక నీటిని డబ్బులిచ్చి  ప్రైవేట్‌ ట్యాంకర్లతో తెప్పించుకుంటున్నారు. ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్ల నిర్మాణం, ట్రయల్‌ రన్‌ పూర్తిచేసి ఇళ్లకు నల్లా నీటి సరఫరాకు మరో రెండు నెలలైనా పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు పట్టణ వాసులకు నీటి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదిలా ఉంటే పైప్‌లైన్‌ కోసం తవ్వేసిన రోడ్లతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పైప్‌లైన్‌ ఓకే అయితేనే ప్యాచ్‌వర్క్‌ చేస్తామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

ఇబ్రహీంపట్నం, జూన్‌ 4: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో కొన్ని బస్తీల్లో ప్రజలు తాగునీటికి, వాడుక నీకిటి ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో పైప్‌లైన్‌ అనేదే లేక ట్యాంకర్ల ద్వారా, లేదంటే సొంత బోర్లతో నీటి సమస్య తీర్చుకుంటున్నారు. అయితే వ్యక్తిగత బోర్లలో నీరు ఎండిపోవడంతో ఎక్కువ శాతం ప్రైవేట్‌ ట్యాంకర్లు కొని నీటి ఇబ్బందులు తీర్చుకుంటున్నారు. పేద, మధ్య తరగతి వారు ట్యాంకర్లు కొనలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పైప్‌లైన్ల కోసం రోడ్లను ఎక్కడికక్కడ తవ్వేయడంతో రాకపోకలకు సైతం జనం ఇబ్బందులు పడుతున్నారు. పైప్‌లైన్‌ పూర్తయినా రోడ్లకు ప్యాచ్‌వర్క్‌ చేయక ద్విచక్ర వాహనాలను సైతం తోలలేని పరిస్థితి నెలకొంది. పనులు పూర్తవడానికి మరో నెండు నెలలు పట్టేలా ఉంది. పట్నంలో మిషన్‌ భగీరథ పనులకు ప్రభుత్వం రూ.40.35కోట్లు వెచ్చిస్తోంది. మొదట 118కిలో మీటర్లు పైప్‌లైన్‌ వేయాలనుకున్నా చివరకు దాని పరిధి 141కిలో మీటర్లకు పెరిగింది. దానిలో ఇప్పటికే 139.5కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేసినట్టు ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఒకటిన్నర కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేస్తే లక్ష్యాన్ని పూర్తి చేసినట్టే. వేసిన పైప్‌లైన్‌తో మొత్తంగా 9,500ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 7,800 కనెక్షన్లు ఇచ్చామని అధికారుల చెబుతున్నారు. ఆరు ఓహెచ్‌ఎ్‌సఆర్‌ల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పూర్తి స్థాయినలో మిషన్‌ భగీరథ నల్లా నీరు రాక చాలా కాలనీల వారు ప్యూరిఫైడ్‌ నీటిని కొని తాగుతున్నారు.


  • పనులు మొదలైందే ఆలస్యంగా

టెండర్‌ ద్వారా మొదట రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ యాన్యుటీ కింద ఈ పనులు తీసుకొని మధ్యలోనే పనులను నిలివేసింది. దీంతో ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దుచేసి మెగా ఇంజినీరింగ్‌కు ఈ పనులను అప్పగించారు. దీంతో పనులు ప్రారంభమే ఆలస్యం అయింది. వేసవిలో ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరలేదు. పట్టణ వాసులకు నీటి సమస్య తప్పలేదు. 11, 12 వార్డుల్లో కొందరు చాలా ఇళ్లలో ట్యాంకర్లతో నీటిని కొంటున్నారు. పాత పైప్‌లైన్‌ ఉన్నచోట్ల సైతం మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బస్తీల్లో నీటి కటకట నెలకొంది. చేసేది లేక పేద, గొప్ప తేడా లేకుండా అందరూ వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేస్తున్న ఫిల్టర్‌ నీటిని కొని తాగుతున్నారు. వాడుక నీటికి ప్రైవేట్‌ ట్యాంకర్లు కొని ఇళ్లలోని సంపులు, బ్యారెళ్లలో నీటిని నిల్వ చేసుకొని పొదుపుగా వాడుకుంటున్నారు. ఇళ్లలో వేసుకున్న వ్యక్తిగత బోర్లు 90శాతానికి పైగా ఎండిపోవడంతో సమస్య తీవ్రమైంది.


  • రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తాం : యాదయ్య, డిప్యూటీ ఈఈ, మిషన్‌ భగీరథ

పైప్‌లైన్‌ పనులు వంద శాతం పూర్తి చేసేందుకు, అలాగే ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చే పనుల వేగవంతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చే పని నెల రోజుల్లో పూర్తిచేస్తాం. ఒకటి, రెండు చోట్ల మినహా అన్ని చోట్లా ట్రయల్‌ రన్‌(కమిషనింగ్‌) చేపడుతున్నాం. లీకేజీలు ఇతరత్రా సమస్యలుంటే గుర్తించేందుకు, లీకేజీలుంటే మరమ్మతులు చేసేందుకు రోడ్లకు ఇప్పుడే ప్యాచ్‌ వర్క్‌ చేయడం లేదు. మెయిన్‌, డిస్ర్టిబ్యూషన్‌ పైప్‌లైన్‌ అంతా ఓకే అయిన తరువాత సీసీ ప్యాచ్‌వర్క్‌ చేయిస్తాం. ప్రధాన రోడ్డుపై వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఒకటి రెండుచోట్ల సీసీ వేస్తున్నాం. ఐసీడీఎస్‌ కార్యాలయం నుంచి పాత పోలీ్‌సస్టేసన్‌ వరకు సీసీ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పైప్‌లైన్‌ వేసిన చోట్ల సీసీ రోడ్ల ప్యాచ్‌వర్క్‌ రెండు నెలల్లో పూర్తిచేస్తాం.


  • నీటి సమస్య తలెత్తకుండా చర్యలు : ఎండీ.యూసుఫ్‌, కమిషనర్‌, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 

పట్టణంలో ఎక్కడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తంకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పైప్‌లైన్‌ పనులకు వార్డుల్లో ప్రజలు కూడా సహకరిస్తున్నారు. సీసీ రోడ్డు పనులు మున్సిపాలిటీ చేపడుతుంది. అయితే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు మొత్తం పూర్తయిన తర్వాతే సీసీ రోడ్లు వేయాలని నిర్ణయించాం. అప్పటి వరకు పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి తగిన సహకారం అందించాలి. అన్ని కాలనీలు, ఆవాసాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2022-06-05T05:34:21+05:30 IST