Mission 2024: ఆ ఒక్క విషయంలో కేసీఆర్ ఊ కొడతారా?

ABN , First Publish Date - 2022-09-08T01:49:46+05:30 IST

న్యూఢిల్లీ: బీజేపీ ముక్త్ భారత్ అంటూ యుద్ధభేరీ మోగించిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు..

Mission 2024: ఆ ఒక్క విషయంలో కేసీఆర్ ఊ కొడతారా?

న్యూఢిల్లీ: బీజేపీ ముక్త్ భారత్ అంటూ యుద్ధభేరీ మోగించిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. కాంగ్రెస్‌‌‌‌ను కలుపుకునే విషయంలో విపక్ష నేతలతో ఏకీభవిస్తారా? ఏకీభవించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ పరిశీలకులంటున్నారు. మిగతా రాజకీయ పక్షాలన్నీ కాంగ్రెస్‌తో కలిసి బీజేపీపై పోరాడేందుకు సై అంటున్నాయి. జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటివరకూ కలిసిన విపక్ష నేతలంతా కాంగ్రెస్‌తో కలిసి పోరాడే విషయంలో సమ్మతి తెలిపారని సమాచారం. అంతేకాదు నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను కలుసుకున్నారు. విదేశాల నుంచి సోనియా రాగానే ఆమెతోనూ సమావేశమౌతానని ప్రకటించారు. మిగతా విపక్ష నేతలెవ్వరికీ కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు అభ్యంతరం లేదని తెలుస్తోంది. 


నితీశ్ ఇప్పటివరకూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జేడీఎస్ అధినేత కుమారస్వామిలను కలుసుకున్నారు. ఎన్డీయేలో లేకున్నా తటస్థంగా ఉంటోన్న బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌తోనూ నితీశ్ చర్చలు జరపనున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతోనూ నితీశ్ చర్చలు జరపనున్నారు. 


రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో బీహార్‌లో కాంగ్రెస్ సంకీర్ణ సర్కారులో చేరింది. ఇటీవలి వరకూ మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనతో కలిసి సంకీర్ణంలో కొనసాగింది. 


మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో ప్రతిపక్షంగా ఉంది. అధికార టీఆర్ఎస్‌‌కు‌ ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ సవాలు విసురుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుందనే అంశంపై అందరి దృష్టీ నెలకొంది. బీజేపీ ముక్త్ భారత్ అంటోన్న కేసీఆర్ కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సన్నద్దమౌతారా... అదే జరిగితే టీఆర్ఎస్, కాంగ్రెస్ జట్టుగా మారి బీజేపీని ఢీ కొంటాయి. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో ఇప్పటికిప్పుడు చేతులు కలపాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలయ్యేవరకూ కాంగ్రెస్‌ విషయంలో ఏమీ తేల్చకుండా ఫలితాలు వచ్చాక జాతీయ స్థాయి పోరులో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలా వద్దా అని నిర్ణయించే అవకాశముందని పరిశీలకులంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికలయ్యాక... జాతీయ స్థాయి పోరులో భాగంగా టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా మార్చుకునేందుకు అవకాశముందని చెబుతున్నారు. కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను కూడా కలుపుకోవాలన్న మిగతా విపక్ష నేతలకు కేసీఆర్ కూడా తలొగ్గే అవకాశముందని పరిశీలకులంటున్నారు. 

Updated Date - 2022-09-08T01:49:46+05:30 IST