పెరిగిపోతున్న మిస్సింగ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-08-14T06:05:20+05:30 IST

ఏదో పని ఉందని బయటకు వెళ్లిన అమ్మాయి ఎంతసేపైనా ఇంటికి తిరిగిరాదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీస్తే.. తెలియదని, రాలేదని అంటారు.

పెరిగిపోతున్న మిస్సింగ్‌ కేసులు

అమ్మాయి కనిపించడం లేదు..!

ప్రేమ పేరిట వెళ్లేవారే ఎక్కువ

ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు


అనంతపురం క్రైం : ఏదో పని ఉందని బయటకు వెళ్లిన అమ్మాయి ఎంతసేపైనా ఇంటికి తిరిగిరాదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీస్తే.. తెలియదని, రాలేదని అంటారు. హఠాత్తుగా మాయమైన తమ బిడ్డ ఏమైందోనని తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన మెట్లు ఎక్కుతారు. ‘సార్‌.. భయంగా ఉంది. కాస్త వెతికి పెట్టండి..’ అని వేడుకుంటారు. పోలీసులు మిస్సింగ్‌ తీగలాగితే.. పేమ డొంక కదులుతోంది.  ఎవరినో ప్రేమించి.. వెంట వెళ్లిపోయిందని బయట పడుతుంది. కొన్ని నెలలుగా అనంతపురం నగరంలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసి, చదువును మధ్యలోనే వదిలేసి.. ప్రేమించిన యువకుడు జీవితంలో స్థిరపడలేదని తెలిసీ.. అలా వెళ్లిపోతున్నారు. ప్రేమ పెళ్లిళ్లకు గతంతో పోలిస్తే తల్లిదండ్రులు పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. అబ్బాయి ఉద్యోగం, వ్యాపారం.. ఏదో ఒకటి చేస్తూ, తమ బిడ్డను పోషించే స్థాయిలో ఉన్నాడని తెలిస్తే ఒప్పుకుంటున్నారు. కానీ డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులు ప్రే‘మాయ’లో పడుతున్నారు. వ్యామోహమో, ఆకర్షణో తెలియని వయసు వారిది. జీవితంలో స్థిరపడకనే అబ్బాయి, అమ్మాయి కలిసి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్నారు. కొడుకు అయితే పెద్దగా సమస్య లేదు. కానీ కూతురు అయితే..? తన భద్రత ఏమిటి..? తన భవిష్యత్తు ఏమిటి..? తల్లిదండ్రులకు ఇంతకు మించిన వేదన ఏముంటుంది..? కొందరు  బాలికలు కూడా ఇలా ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు. నిత్యం మోసపోతున్నారు. ఇంకొందరు యువతులు పెళ్లయిన వారితో వెళ్లిపోతున్నారు. నగర పరిధిలో పోలీస్‌ స్టేషన్లలో ఇటీవల యువతులు అదృశ్యమైనట్లు 50కి పైగా కేసులు నమోదయ్యాయి.  సమస్య తీవ్రతకు ఈ సంఖ్య అద్దం పడుతోంది.


అదృశ్యం వెనుక ప్రేమే..

అనంతపురం నగరంలో అదృశ్యమైన చాలా మంది యువతుల వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశలో ప్రేమించడం, చదువు పూర్తయ్యాక తాము ప్రేమికుడిని దక్కించుకునేందుకే ఇంటి నుంచి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే.. ప్రేమ కథలు బయట పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం త్రీటౌన పోలీ్‌సస్టేషన ప్రేమ పెళ్లిళ్లకు కేరా్‌ఫగా ఉన్నింది. ఇప్పుడు కొంత తగ్గినా.. వనటౌన పరిధిలో మిస్సింగ్‌ల శాతం ఎక్కువైంది. టూటౌన, త్రీటౌన, ఫోర్త్‌టౌన, అనంతపురం రూరల్‌ స్టేషన్ల పరిధిలో అమ్మాయిల మిస్సింగ్‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 


మోసపోతున్న మైనర్లు

- అనంతపురం హనుమాన కాలనీకి చెందిన బేల్దారి వడ్డే రమణకు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటి భార్య ఉంది. రెండో భార్య వదిలేసింది. ఈ ఘనుడు పక్కనే ఉన్న యువజన కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలికను మాయమాటలతో నమ్మించాడు. రెండు నెలల క్రితం అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. ధర్మవరంలోని వడ్డే మహేష్‌ అనే వ్యక్తి ఇంట్లో మూడురోజుల పాటు గడిపారు. త్రీటౌన పోలీసులు విచారించి.. బాలికను రక్షించారు. మైనర్‌ను తీసుకెళ్లినందుకు రమణను, సహకరించినందుకు మహే్‌షను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

- అనంతపురం పాతూరుకు చెందిన దంపతులు తమ కూతురు, అల్లుడు చనిపోతే.. వారి కుమార్తెను (మనవరాలిని) పెంచుకుంటున్నారు. ఉన్నట్లుండి తను అదృశ్యమైంది. దీంతో ఆ దంపతులు వనటౌన పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు.  తను ఏమైందో ఇప్పటికీ తెలియదని బాధితులు అంటున్నారు. ఇంటర్‌ చదువుతున్న ఆ అమ్మాయిపై అదే కాలనీకి చెందిన ఓ యువకుడు కన్నేశాడని అంటున్నారు. అమ్మాయి అదృశ్యం వెనుక అతనున్నాడని అంటున్నారు. కానీ ఏ విషయం నిర్ధారణ కాలేదు. దీంతో దంపతులు గత నెలలో ఎస్పీని కలిసి సమస్య చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. 

- అనంతపురం 5వ రోడ్డుకు చెందిన ఓ అమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. బత్తలపల్లికి చెందిన డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడితో ప్రేమలో పడిందని, అందుకే వెళ్లిపోయిందని త్రీటౌన పోలీసులు నిర్ధారించారు.

- అనంతపురం హౌసింగ్‌ బోర్డుకు చెందిన ఓ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. తను రెండు నెలల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు టూటౌన పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. గుంతకల్లుకు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఉద్యోగం చేస్తున్న ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని, స్టేషనలో అడుగుపెట్టింది. 

- అనంతపురం నగరంలోని ఓ కాలనీకి చెందిన యువతిని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. రెండు వారాల క్రితం అకస్మాత్తుగా ఆ అమ్మాయి ఇంటి  నుంచి వెళ్లిపోయింది. అప్పటికే పెళ్ళయిన వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. అమ్మాయిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు పోలీసులను కోరారు. 

- పామిడి మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం నగరంలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. రెండు నెలల క్రితం తన తండ్రితో పాటు హాస్టల్‌కు వచ్చింది. నిమిషాల వ్యవధిలో తండ్రి కళ్లుగప్పి అదృశ్యమైంది. పోలీస్‌ స్టేషనలో పంచాయితీ పెట్టినా, ఆ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయివద్ద ఉండేందుకే మొగ్గు చూపింది. 

- అనంతపురం నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన పరిధిలోని మారుతీనగర్‌కు చెందిన ఓ యువతి అదృశ్యమైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్టేషనలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీసేలోగా.. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి వచ్చింది. 


బాలికలను తీసుకువెళ్లడం నేరం

ప్రేమ కావచ్చు.. ఆకర్షణ కావచ్చు. బాలికలను తీసుకువెళ్లడం నేరం. ఈ విషయమై యువకులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. బాలికలు ఇష్టపడి వెళ్లినా.. తీసుకవెళ్లిన యువకుడికి కష్టాలు తప్పవు. ఐపీసీ, పోక్సో చట్టాల కింద జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేయాలి. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా చెప్పాలి. పాఠ్యాంశాలకు పరిమితం కాకుండా.. విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా వారిలో చైతన్యం కలిగించాలి. ప్రేమ తప్పు కాదని, కానీ జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి గురించి ఆలోచించాలని కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.


పర్యవేక్షణ లోపమే..

యువతుల మిస్సింగ్‌ కేసుల్లో 90 శాతం ప్రేమ వ్యవహారాలవే ఉంటున్నాయి. స్కూళ్లు, కాలేజీల్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. వారి పర్యవేక్షణ లేకపోవడం మిస్సింగ్‌కి ఒక కారణం. మొబైల్స్‌ ఉపయోగించడం, సోషల్‌మీడియా ద్వారా కలిగే పరిచయాలతో.. యువతీ యువకులు ఆకర్షణకు లోనై, తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోతున్నారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులతో పాటు అమ్మాయిలకు కౌన్సె లింగ్‌ ఇస్తున్నాం. అబ్బాయిలకూ పోక్సో కేసుల విషయం చెప్పి అవగాహన కల్పిస్తున్నాం. 

- ఆర్ల శ్రీనివాసులు, దిశ, అనంతపురం ఇనచార్జ్‌ డీఎస్పీ

Updated Date - 2022-08-14T06:05:20+05:30 IST