తప్పిపోలేదు.. చంపేశారు

ABN , First Publish Date - 2021-10-18T05:17:07+05:30 IST

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మహిళ.

తప్పిపోలేదు.. చంపేశారు
హత్య కేసు నిందితులను చూపుతున్న పోలీసులు

  1. ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
  2. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
  3. కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు
  4. కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరి అరెస్టు 


ఓర్వకల్లు, అక్టోబరు 17: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మహిళ. ఆ తరువాత తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తి వివరాలను రాబట్టారు. కర్నూలు రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన చెట్ల మల్లాపురం రామయ్య (35) కనిపించడం లేదని ఆయన భార్య విజయలక్ష్మి పోలీసులకు గత నెల 23న ఫిర్యాదు చేసింది. పండ్ల వ్యాపారం నిమిత్తం గత నెల 14వ తేదీ ఉదయం ఉయ్యాలవాడ నుంచి జడ్చర్లకు వెళ్లారని, ఆ తరువాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రామయ్యతో కలిసి వ్యాపారం చేసే వారిని విచారించానని, ఆయన అక్కడకు వెళ్లలేదని తెలిసిందని ఫిర్యాదులో విజయలక్ష్మి పేర్కొంది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విజయలక్ష్మి అదే గ్రామానికి చెందిన ముల్లా మొహ్మద్‌ ఖైజర్‌ అలియాస్‌ బీజర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. విజయలక్ష్మిని, ఆమె ప్రియుడు మొల్ల మొహ్మద్‌ ఖైజర్‌ను ఉయ్యాలవాడ సమీపంలో శనివారం అరెస్టు చేసి విచారించారు. విజయలక్ష్మికి రెండేళ్ల నుంచి ఖైజర్‌తో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయం తెలిసి రామయ్య తన భార్యను వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా రామయ్యను అడ్డు తొలగించుకోవాలని విజయలక్ష్మి నిర్ణయించుకుందని తెలిపారు. విజయలక్ష్మి, ఖైజర్‌ పథకం ప్రకారం గత నెల 13న రాత్రి 10 గంటల సమయంలో ఉయ్యాలవాడలోని తన ఇంట్లో నిద్రిస్తున్న రామయ్యను హత్య చేశారని తెలిపారు. రామయ్య గొంతుకు ఖైజర్‌ టవల్‌ బిగించాడని, విజయలక్ష్మి తన భర్త అరవకుండా నోరు నొక్కి పట్టుకుని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సాక్ష్యం లేకుండా చేసేందుకు రామయ్య మృతదేహాన్ని ఖైజర్‌ తన బొలేరో వాహనంలో వేసుకుని కల్లూరు మండలం తడకనపల్లె సమీపంలో హంద్రీనీవా కాలువలో పడేశాడని తెలిపారు. ఆ తర్వాత విజయలక్ష్మి ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త కనిపించడం లేదని చుట్టు పక్కల వారికి తెలియజేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. హత్య ఘటనను విజయలక్ష్మి కూతురు చందన, కొడుకు ఎల్ల శేఖర్‌ చూశారని, ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో విజయలక్ష్మి, ఆమె ప్రియుడు పారిపోయారని తెలిపారు. విజయలక్ష్మి, ఖైజర్‌పై హత్య కేసు నమోదు చేశామని సీఐ శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. రామయ్య మృతదేహాన్ని వెతికేందుకు ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున, నాగులాపురం ఎస్‌ఐ ప్రేమ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. హత్య కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ మహేష్‌ అభినందించారు.

Updated Date - 2021-10-18T05:17:07+05:30 IST