దారితప్పిన ప్రతిభావంతుడు

ABN , First Publish Date - 2022-05-12T10:05:49+05:30 IST

అతడు ఎథికల్‌ హ్యాకర్‌..! బగ్‌బౌంటీలో భాగంగా పేమెంట్‌ గేట్‌వేలు, యాప్‌లు, సాఫ్ట్‌వేర్లలో లొసుగులను గుర్తించి..

దారితప్పిన ప్రతిభావంతుడు

  • ఒకప్పుడు బగ్‌బౌంటీలతో పారితోషికాలు
  • స్టార్ట్‌పలు, ఎథికల్‌ హ్యాకింగ్‌తో రాణింపు
  • అత్యాశతో పేమెంట్‌ గేట్‌వేలపై దాడులు
  • పేమెంట్‌గేట్‌వేలో 52.9లక్షల తస్కరణ
  • విజయవాడకు చెందిన హ్యాకర్‌కు..
  • బేడీలు వేసిన హైదరాబాద్‌ పోలీసులు
  • హ్యాకర్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి: సీవీ ఆనంద్‌


హైదరాబాద్‌ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): అతడు ఎథికల్‌ హ్యాకర్‌..! బగ్‌బౌంటీలో భాగంగా పేమెంట్‌ గేట్‌వేలు, యాప్‌లు, సాఫ్ట్‌వేర్లలో లొసుగులను గుర్తించి.. ఆ వివరాలను ఆయా కంపెనీలకు అందజేసేవాడు. ఫలితంగా డాలర్లలో పారితోషకాన్ని పొందేవాడు. కానీ, అత్యాశ అతణ్ని పెడదోవ పట్టించింది. పే మెంట్‌ గేట్‌వేల్లోకి దూరి, లక్షలు తస్కరించేలా చేసింది. ఫలితంగా ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. బుధవారం  విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన వనం శ్రీరామ్‌ దినేశ్‌కుమార్‌ బీటెక్‌ చదువుతూ.. మధ్యలోనే మానేశాడు. ఉద్యోగాన్వేషణ చేస్తూనే.. తనకు ఉన్న సాంకేతిక ప్రతిభతో సాఫ్ట్‌వేర్లు, యాప్‌లలో లొసుగులను గుర్తించడం(బగ్‌ బౌంటీ) ప్రారంభించాడు. అలా కొన్ని పేమెం ట్‌ గేట్‌వేల్లో ఉన్న వల్నరబిలిటీ్‌సను గుర్తించి, ఒక్కో బగ్‌ను గుర్తించినందుకు 100 అమెరికా డాలర్ల చొప్పున పారితోషికం పొందేవాడు. ఛతీ్‌సగఢ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎథికల్‌ హ్యాకింగ్‌లో దూరవిద్య ద్వారా బీఎస్సీ పూర్తిచేశాడు. దాంతోపాటు యూట్యూబ్‌ వీడియోలను చూసి, హ్యాకింగ్‌పై రాటుదేలాడు. గేట్‌క్యాబ్‌, నైట్‌ఔట్‌ షెఫ్స్‌, డైలీ బాస్కెట్‌ పేర్లతో స్టార్ట్‌పలు ప్రారంభించాడు. తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అయినా.. ఉన్నదాంతో సంతృప్తిపడక.. సంపాదనపై ఆశ చావక.. హ్యాకింగ్‌ ప్రతిభను దుర్వినియోగపరుచుకున్నాడు. పేమెంట్‌ గేట్‌వేల్లో మర్చంట్‌ కేటగిరీలో నకిలీ యూజర్‌ఐడీ, ఫోన్‌నంబర్లు ఇచ్చి ఖాతాలు తెరిచేవాడు. ఆయా పేమెంట్‌ గేట్‌వే యాప్‌లలో ఉండే లొసుగులను గుర్తించి.. సూపర్‌ అడ్మిన్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను తెలుసుకునేవాడు. తన యూజర్‌ ఐడీని కూడా సూపర్‌ అడ్మిన్‌గా మార్చుకున్నాడు. 


ఇలా బంజారాహిల్స్‌కు చెందిన ఎక్స్‌సిలికాన్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ నిర్వహించే పే-జీ అనే పేమెంట్‌ గేట్‌వే యాప్‌లోనూ సూపర్‌ అడ్మిన్‌గా తన ఖాతాను మార్చుకున్నాడు. అందులో మర్చంట్లు, డిస్ట్రిబ్యూటర్లు జరిపే లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాడు. నకిలీ ధ్రువపత్రాలతో మూడు బ్యాంకు ఖాతాలు తెరిచాడు. పే-జీ యాప్‌లో జరిగే లావాదేవీలను అడ్డుకుని, ఆ డబ్బులను తన మూడు నకిలీ బ్యాంకు ఖాతాలకు మళ్లించడం ప్రారంభించాడు. ఇలా ఒక్క రోజులో రూ. 52.9 లక్షలను కొల్లగొట్టాడు. ఆ వెంటనే ఆయా బ్యాంకుల్లోని నిధులను వెచ్చించి, క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత క్రిప్టోకరెన్సీని విక్రయించి.. ఆ మొత్తాన్ని తన అసలు బ్యాంకు ఖాతాలోకి బదలాయించుకున్నాడు. విషయా న్ని గుర్తించిన ఎక్స్‌సిలికా సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ యాజమాన్యం మార్చి 17న హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌ అధికారులు.. నిందితుడు వీపీఎన్‌ సర్వర్లతో ఈ సైబర్‌దోపిడీకి పాల్పడ్డట్లు గుర్తించారు.  బుధవారం తెల్లవారుజామున అతణ్ని విజయవాడలో అరెస్టు చేశారు. ఈ నేరంలో దినేశ్‌కుమార్‌కు సహకరించిన హనుమకొండకు చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ చింటూ నాగసాయిని కూడా అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.


ఫిర్యాదుల్లో 20%  సైబర్‌ నేరాలే!

నగరంలో సైబర్‌ నేరాలు పెరిగిపోయాయని సీవీ ఆనంద్‌ అన్నారు. నగరంలో ప్రతిరోజు సగటున 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతుంటే.. అందులో 20ు వాటా సైబర్‌ నేరాలదేనన్నారు. అందుకు అనుగుణంగా పోలీసింగ్‌లో మార్పులు చేసుకుంటున్నామని, ప్రస్తుతం ప్రతి ఠాణాలో సైబర్‌క్రైమ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.  దేశంలోనే తొలిసారి సైబర్‌నేరాల్లో ఓ హ్యాకర్‌ (దినేశ్‌కుమార్‌)ను అరెస్టు చేశామని వెల్లడించారు.

Read more