ఒక చిన్న ఊరిలో ఒక పేద కుమ్మరి నివసించేవాడు. ఒకరోజు అతడు ప్రమాదవశాత్తు కిందపడటంతో నుదుటికి గాయం అయింది. కొన్నిరోజులకు గాయం తగ్గిపోయినా మరక మాత్రం అలాగే ఉండిపోయింది. తరువాత ఆ ఊరు తనకు అంతగా కలిసి రాలేదని అనుకుంటూ మరో ఊరికి మకాం మార్చాడు. అదృష్టవశాత్తు అతనికి రాజు సభలో ఉద్యోగం దొరికింది. రాజు కుమ్మరి నుదుటిపై ఉన్న మరకను చూసి అతడు గొప్ప యుద్ధవీరుడు అయి ఉంటాడని భావించి ఉద్యోగం ఇచ్చాడు. సభలో అతడికి గొప్ప గౌరవ మర్యాదలు లభించాయి. కొన్ని నెలల తరువాత శత్రువులు ఆ రాజ్యంపై దాడి చేశారు. వెంటనే రాజు కుమ్మరిని పిలిచి సైన్యానికి నాయకత్వం వహించమని అదేశించాడు. ఆ మాటలు విన్న కుమ్మరి భయపడిపోయాడు. వెంటనే రాజుకు నిజం చెప్పాడు. నుదుటిపై మరక ఎలా ఏర్పడిందో పూస గుచ్చినట్టుగా వివరించాడు. నిజం తెలుసుకున్న రాజు కుమ్మరిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాడు. కుమ్మరి తన అదృష్టాన్ని నిందించుకుంటూ మరో ఊరికి పయనమయ్యాడు.