మిరుమిట్లు మెచ్చని మేరువు

ABN , First Publish Date - 2021-05-20T09:45:43+05:30 IST

ఉన్నట్టుండి ఆయన వెళ్లిపోయాడు. ఎవరమూ సిద్ధంగా లేము. ఆయనా లేడు. కానీ, విషపు రెక్కలు విసిరిన కాలం అనేకమందిని లాగానే ఆయన్నీ ఎత్తుకుపోయింది...

మిరుమిట్లు మెచ్చని మేరువు

ఉన్నట్టుండి ఆయన వెళ్లిపోయాడు. ఎవరమూ సిద్ధంగా లేము. ఆయనా లేడు. కానీ, విషపు రెక్కలు విసిరిన కాలం అనేకమందిని లాగానే ఆయన్నీ ఎత్తుకుపోయింది. ఎంత దుర్మార్గం అంటే, ఎంతటి అన్యాయం అంటే, ఎంతటి శూన్యం అంటే పెడబొబ్బలు పెట్టి రోదించాలనిపించేంత. గుండెలార్చుకుపోయేలా పొగిలిపోయేంత. చెప్పవలసినవి ఆయనకు చాలా ఉన్నాయి, అవన్నీ ఏమవుతాయి, ఆయన వినవలసినవీ ఉన్నాయి, అవి ఎవరికి చెప్పాలి? ఎవరి అవ్యక్త ఆమోదం కోసం, రేఖామాత్ర ప్రశంస కోసం ఎదురుచూడాలి? ఎవరి విలువలతో తూకం వేసుకుని సంతృప్తిపడాలి?

 

కెకెఆర్ ఇక లేరు. ఆయన గురించిన ఈ వ్యక్తీకరణ కూడా కష్టంగా ఉంది. ఆయన ఉనికిని ఇక నుంచి భూతకాలంలో ప్రస్తావించాలి, చాలా కష్టం సార్, 


ఒకానొక అప్రసిద్ధుడు, అవిఖ్యాతుడూ, అలవోకగా ఒక్క అక్షరమూ రాయలేని మితరచయిత కె.కె. రంగనాథాచార్యులు (కెకెఆర్), వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా మేధావి, ప్రత్యక్షంగా వందలాది విద్యార్థులకు బోధించారు. రచయితగా వేలాది మంది అభిమానులను పొందారు. ఆడంబరానికి, ప్రచారానికీ దూరంగా ఉన్నారు. ‘నేను’ అన్నమాట రాయడానికి కూడా ఆయనకు సంకోచం. అధ్యయనం, బోధన, రచన, వ్యక్తిత్వం.. ఈ నాలుగూ కెకెఆర్‌లో విశేషంగా కనిపించేవి. తన ప్రత్యేకతలను ప్రస్ఫుటంకానివ్వకుండా నిరంతరం ఆయన జాగ్రత్త పడేవారు. 


కెకెఆర్ తెలుగులో సంస్కృతంలో ఇంగ్లీషులో విద్వాంసులు. శాసనభాషా పరిణామంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన భాషాశాస్త్రవేత్త. తెలుగు సాహిత్యవిమర్శలో, సాహిత్యచరిత్రరచనలో కొత్తదారులు వేసినవారు. 


ఆయనతో ఈ వ్యాసకర్త ప్రయాణం సుమారు నాలుగున్నర దశాబ్దాలు. నాకు పరిచయమైన మొదటి నవ్యమానవుడు కెకెఆర్. ‘‘అందరిలాంటి వాడు కాదు, ఆచారాలను తోసిపారేశాడు, కుటుంబాన్ని ధిక్కరించాడు, తాపీ ధర్మారావు చేతుల మీదుగా కులాంతర వివాహం చేసుకున్నాడు, దిగంబర కవుల మిత్రుడు, విప్లవ భావాలున్నవాడు.’’ 1970 దశకం మధ్యలో ఆంధ్రసారస్వత పరిషత్ కాలేజిలో విద్యార్థిగా ఉన్న నాకు కెకెఆర్ అట్లా పరిచయం అయ్యారు. ఆయన ప్రిన్సిపాల్. నేను ఇంటర్ స్థాయి విద్యార్థిని. విన్న వివరాలు కలిగించే ఆకర్షణకు, కెకెఆర్ వ్యక్తిత్వ ప్రత్యక్ష పరిచయం మరింత ఆజ్యం పోసేది. ఏమిటీ మనిషి? ఇంత స్నేహంగా ఆదరంగా ఉంటారు? చదువుకునేవాళ్లను చేయిపట్టుకుని మరీ నడిపిస్తాడు? అని ఆశ్చర్యం వేసేది. అంతటి బలమైన, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ప్రేమలో పడిపోవడం, తరువాతి జీవిత ప్రాధాన్యాలను, అభిరుచులను, అవగాహనను కూడా ప్రభావితం చేసింది. నాలాగా ఎందరో? బహుశా, ఆనాటి ఆచోటున అందరూ!! 


విప్లవాలతో ఆయనకు సంబంధం లేకుండా పోలేదు కానీ, ఆయన తన మార్గాన్ని మరో రకంగా మలచుకున్నారు. సమాజరంగంలో క్రియాశీలంగా పనిచేయగల వ్యక్తులకు కావలసిన చైతన్యాన్ని, బౌద్ధిక పరిపుష్టి మేళవించి అందించాలనుకున్నారు. విద్యార్థులతో వ్యవహరించే అధికారిగా, అటువంటి వాతావరణాన్ని నిర్మించారు. తాను విద్వాంసుడిగా, మేధావిగా తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్యవిమర్శ రంగాలలో నాటి కాలం డిమాండ్ చేస్తున్న కొత్త దారులను వేయడానికి ఉపక్రమించారు. ప్రాచీన తెలుగు సాహిత్యచరిత్రను ఎట్లా చూడాలో, ఆధునిక తెలుగు సాహిత్యం క్రమపరిణామాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కెకెఆర్ చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేదు. 1980ల దశాబ్దానికి ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాల అవగాహనకు, ఆనాటికి అత్యాధునికమైన, ప్రజాపక్షమైన సాహిత్యచరిత్రను ఆయన ప్రతిపాదించారు. మరో చూపుని అన్వయించారు. తెలుగులో తొలి సమాజకవులను ప్రతిపాదించారు. తరువాతి ఆలోచనలకు ప్రాతిపదికలను అందించారు. సారస్వత పరిషత్ వారి అనేక ప్రచురణలకు ఆయన అందించిన సుదీర్ఘ పీఠికలు, కఠినమైన ఆయన పరిశ్రమను, నిర్దుష్టత విషయంలో ఆయన పట్టింపును తెలియజేస్తాయి. వివిధ శాస్త్ర విజ్ఞాన విషయాలలో ఆవిష్కరణలను ఎట్లా గౌరవిస్తామో, కెకెఆర్ వంటి వారు చేసిన మౌలిక ప్రతిపాదనలను కూడా అట్లా పరిగణించవలసిన అవసరం ఉన్నది. కాలక్రమంలో ఆయన భావాలలో, అధ్యయనంలో మరింత పరిపక్వతను గమనించవచ్చు, మునుపు రాసిన వాటిని మారిన అవగాహన ఆధారంగా సవరించుకోవడం కూడా చూడవచ్చు. ఆ స్థాయి మేధాశ్రమ చేసినవారికి సాధారణంగా కనిపించే అహంభావం కానీ, అతిశయం కానీ కెకెఆర్‌లో ఉండవు. గురజాడ అప్పారావును నిరంతరం అధ్యయనం చేస్తూ, ఒక్కొక్క కొత్త స్ఫురణకు ముగ్ధుడైపోయే కెకెఆర్, గురజాడ రచనలో ఉండే సాధారణతను, అసాధారణతను తన జీవితంలోకి తెచ్చుకోగలిగారు. బౌద్ధికరంగప్రమాణాలను పాటిస్తూ, రాజకీయంగా సరి అయిన వాచకం రాయడానికి కెకెఆర్ నిరంతర ప్రయత్నం చేశారు. తన సైద్ధాంతిక అవగాహన నుంచే ఆ రాజకీయాన్ని ఆయన సొంతంగా నిర్వచించుకునేవారు. రానురాను అది ఒక కఠోర వ్రతంలాగా తయారై, తన రచనపై తనకే పూర్తి సంతృప్తి కలగక తాను తలపెట్టిన పెద్ద రచనలను పూర్తి చేయలేదు లేక విడుదల చేయలేదు.


సుమారు రెండు దశాబ్దాల పాటు ప్రిన్సిపాల్‌గా పనిచేసి, ఆ కాలేజీకి, సారస్వత పరిషత్ సంస్థకే ప్రతిష్ఠ పెంచారు. అవగాహన కల్పించడమన్నది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని, వివిధ ప్రాంతాలలో విద్యాబోధన చేసేవారిని తీర్చిదిద్దే తెలుగు భాషాసాహిత్యాల కేంద్రం బాధ్యతతో లోతైన అధ్యయనాన్ని ప్రోత్సహించాలని ఆయన అనుకున్నారు. తన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి గ్రామీణ ప్రాంతాలలో చేస్తున్న సామాజిక కృషి ఆయనకు సంతోషం కలిగించేది. హోరుతో, అలల కల్లోలంతో ఉన్న సముద్రంలో ఆయన చిన్న చిన్న ద్వీపాలను తొలిచారు. ఆయన నాటిన అక్షరాలు తరం నుంచి తరానికి ప్రవహిస్తుంటే ఊరట పొందారు. 


పరిషత్ చదువు పూర్తయి బయటకు వచ్చినా, ఆయనతో ఈ వ్యాసకర్త అనుబంధం కొనసాగింది. ఆయన పరిషత్ వదిలి కేంద్రీయ విశ్వవిద్యాలయం వెళ్లినా విద్యార్థిత్వం ఆగలేదు. ఆయన ఉద్యోగ జీవితం ముగిసిన తరువాత కూడా సంభాషణలు ముగియలేదు. ప్రపంచం మీద ఆయనకు చాలా అసంతృప్తులుండేవి. మనుషుల అల్పత్వం మీద చాలా ఫిర్యాదులుండేవి. తన మీద తనకు కూడా ఏవో పెదవి విరుపులు ఉండేవి. క్రమంగా తానొక బౌద్ధిక ఏకాంతాన్ని సృష్టించుకున్నారు, అప్పుడప్పుడు అందులోకి సందర్శకులను అనుమతించేవారు. కానీ, చివరిరోజుల దాకా కూడా ప్రపంచపు తాజా పోకడల గురించి అవగాహనతోనే ఉన్నారు. సాహిత్య అవగాహనను పెంపొందించే సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉత్తమపురుష– వ్యాసకర్త కావచ్చును కానీ, అనేకమంది సహాధ్యాయులు, మిత్రులు ఇదే తరహాలో ఆయనతో అనుబంధంలో ఉన్నారు. వివిధ రంగాలలో విశేషమైన కృషిచేసినవారు, 1990ల తరువాత మారిన సామాజిక, సాహిత్య అవగాహనల ప్రతినిధులు, సృజనాత్మక రచయితలు, మార్క్సిస్టు, దళితవాద మేధావులు ఆయన విద్యార్థులలో ఉన్నారు. 


వెనక్కి తిరిగి చూసుకుంటే, కెకెఆర్, ఆయనతో పాటు నడిచిన ఇతర అధ్యాపకులు, ఎవరూ తమ విద్యార్థులకు నీతిశతకాలు బోధించలేదు. వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా చెప్పలేదు. వారు తమ పాఠ్యాంశాలను పద్ధతి ప్రకారం బోధిస్తూ వెళ్లారు. కానీ, విద్యార్థులతో స్నేహితులుగా ప్రజాస్వామికంగా మెలిగారు. తమ వ్యక్తిత్వం వ్యక్తమయ్యేట్టుగా దగ్గరకు తీసుకున్నారు. వారి అడుగుజాడలను వారి నడవడిలోనే గుర్తించగలిగాము. డాంబికం ఎక్కడా ఉండకూడదు, అల్పత్వం ఎక్కడా ప్రదర్శించకూడదు, తాపత్రయపడకూడదు, దేబిరించకూడదు, చిన్నచిన్న దీపాలను వెలిగిస్తే పెద్ద వెలుగు వస్తుంది.. ఇవీ కెకెఆర్ అడుగుజాడలు. ఆకులందున అణగిమణగి ఆయనంత అనామకంగా ఉండగలమా, తరువాతి మెట్టు ఎక్కడంలో తాపత్రయపడకుండా ఉండగలమా.. అన్నవి ప్రశ్నలే, కానీ ఆయనే సూచిస్తునట్టు, చేయగలిగినంత చేయి, నియమంగా చేయి. 


అనేక ఆస్కార్‌లు గెలుచుకున్న ‘నొమాడ్‌లాండ్’ సినిమా నిర్వాసిత వేదనను చిత్రిస్తుంది, ఒంటరితనాన్ని మరణవియోగాన్ని కూడా. ఒకరి మరణ సందర్భంలో కథానాయిక ఫెర్న్‌తో బాబ్ అనే పాత్ర ఇట్లా అంటాడు.. ‘‘జ్ఞాపకంలో ఉండేదంతా జీవించి ఉన్నట్టే. చివరి వీడ్కోలు అంటూ ఏదీ ఉండదు, నేనెవరికీ గుడ్ బై చెప్పను, మళ్లీ కలుద్దామనే అంటాను.’’ మరణానంతరం మళ్లీ అందరం కలుస్తామనే నమ్మకాల నుంచే పై సంభాషణ సాగి ఉండవచ్చు. అందరి గమ్యం ఒకటేనన్న నిర్వేదమూ అందులో ఉండవచ్చు.


దిగ్భ్రాంతిని భీతిని కలిగించిన కెకెఆర్ మరణం నుంచి పై మాటలు నాకు ఉపశమనం కలిగించాయి.

‘‘కెకెఆర్ గారూ, మళ్లీ కలుద్దాం..’’ 


కె. శ్రీనివాస్

Updated Date - 2021-05-20T09:45:43+05:30 IST