మిర్చి రైతులకు నష్టాల ఘాటు

ABN , First Publish Date - 2021-01-24T05:35:50+05:30 IST

గత ఏడాది మిర్చి పంట సాగుచేసిన రైతులకు కొంత మేర లాభాలు రావటంతో ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో విస్తారంగా మిరప పంటను సాగుచేశారు.

మిర్చి రైతులకు నష్టాల ఘాటు
కల్లాల్లో ఆరబోసిన కాయలను చూపిస్తున్న రైతు వెంకటేశ్వర్లు



తాలు కాయలతో పంట నష్టం

లబోదిబోమంటున్న సాగుదారులు

తర్లుపాడు, జనవరి 23 : గత ఏడాది మిర్చి పంట సాగుచేసిన రైతులకు కొంత మేర లాభాలు రావటంతో ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో విస్తారంగా మిరప పంటను సాగుచేశారు. మిర్చి పంటలో తాలు కాయలు వస్తుండటంతో  రైతులకు నష్టాలు తప్పలేదు. ఈ ఏడాది మండలంలో పూతలపాడు, గానుగపెంట, తర్లుపాడు, నాయుడుపల్లి, కలుజువ్వలపాడు, తుమ్మలచెరువు, మీర్జపేట గ్రామాల్లో సుమారుగా 780 హెక్టార్లలో మిర్చిని సాగు చేశారు. ఈ ఏడాది మిర్చి నారుకు గిరాకీ ఉండటంతో తేజ రకం మొక్క 1.50 నుంచి 2 రూపాయల వరకు వెచ్చించి మొక్కలను నాటారు. వర్షాలు అధికం కావడంతో విపరీతమైన తెగుళ్లు కూడా వ్యాపించాయి. దీని నివారణకు వేలాది రూపాయలు వెచ్చించి పురుగు మందులను పిచికారి చేసినప్పటికీ ఫలితం రాలేదు. ఎకారానికి వ్యవసాయం, నారు, ఎరువులు, పురుగు మందులు మొత్తం కలిపి దాదాపుగా లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు.  పూత, పిందె, కాయ దశలో నివర్‌ తుఫాన్‌ దెబ్బకు సగం పంట పూర్తిగా నాశనం అయింది. మిగిలిన పంటకు ఉన్న కాయలు గత నెల రోజుల నుంచి కోయగా పూర్తిగా తాలు కాయలే వస్తుండటంతో మిర్చి రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

భారీగా పెరిగిన పెట్టుబడులు 

ఈ ఏడాది మిరప నారుతో పాటు కూలీల ధర, ఎరువులు, పెట్టుబడులు పెరగడంతో ఎకరానికి లక్ష రూపాయల దాకా ఖర్చయింది. ప్రస్తుతం మిరపకాయలు కోసేందుకు ఒక్కొక్కరికి రూ. 320 కూలి ఇచ్చి కోయిస్తున్నారు. దీంతో పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయని రైతులు వాపోతున్నారు.

కూలీల ఖర్చు కూడా రావటం లేదు

ఈ ఏడాది మిరపకాయలు కోసిన కూలీల ఖర్చులు కూడా రావటం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు మొత్తం తాలు రావటంతో కాయలు కోయకుండానే మిరపతోటలను వదిలేస్తున్నారు. గత ఏడాది తాలు కాయలు క్వింటా రూ. 10 వేలు ఉంటే ప్రస్తుతం మార్కెట్‌లో 5 వేల నుంచి 6 వేలు మాత్రమే గ్రామంలో దళారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టుబడులు రాక రైతులు లబోదిబోమంటున్నారు. 

మిర్చి పంటకు ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలి

ఈ ఏడాది నేను 8 ఎకరాల మిరప పంటను సాగు చేశాను. మిరప కాయలు అన్నీ తాలు కాయలు దిగుబడి వచ్చాయి. దీంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మిర్చి పంటకు ఫసల్‌ బీమా పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలి.

- పోటు గురవయ్య, మిర్చి రైతు




Updated Date - 2021-01-24T05:35:50+05:30 IST