నారు.. నాసిరకం

ABN , First Publish Date - 2022-07-27T05:29:17+05:30 IST

నారు.. నాణ్యతతో ఉండాలి. దిగుబడికి నారు నాణ్యతే ప్రదానం. గతంలో ఎవరికివారు నారు పెంచుకునే వారు. అయితే కొన్నేళ్లుగా రైతులు ఎక్కువ మంది నారు కొనుగోలుపై దృష్టి సారించారు.

నారు.. నాసిరకం
బహిరంగ ప్రాంతాలలో మిరపనారు

విచ్చలవిడిగా నారుపెంపకం

నకిలీ హైబ్రిడ్‌ విత్తనాలతో మిరప నారు

నర్సరీలపై కొరవడిన నియంత్రణ.. తనిఖీలు నిల్‌

 

(గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

నారు.. నాణ్యతతో ఉండాలి. దిగుబడికి నారు నాణ్యతే ప్రదానం. గతంలో ఎవరికివారు నారు పెంచుకునే వారు. అయితే కొన్నేళ్లుగా రైతులు ఎక్కువ మంది నారు కొనుగోలుపై దృష్టి సారించారు. దీంతో ఎక్కడికక్కడ నర్సరీల వ్యాపారం జోరందుకుంది. ఇదే అవకాశంగా నర్సరీల నిర్వాహకులు వ్యాపార దృక్పథంతో నారు నాణ్యత గురించి ఆలోచించడంలేదు. చివరకు రైతులు ఆరుగాలం కష్టపడినా దిగుబడులు ఆశించినట్లు రాక తీవ్రంగా నష్టపోతున్నారు. చాలాసందర్భాల్లో నారు నాసిరకమైనందునే రైతులు నష్టపోతున్నట్లు తేలింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నర్సరీ చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిర్చి పంటకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇదే అవకాశంగా మిరపలో నాసిరకం హైబ్రిడ్‌ విత్తనాలతో నారు అమ్మి వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. నర్సరీ చట్టం ఉన్నా దానిని పట్టించుకునేవారే లేరు. నర్సరీలో ఉపయోగించే విత్తనాల నాణ్యతను అగ్రి అధికారులు నిర్ధారించాలి. వ్యాపారులు ఎక్కడ విత్తనాలు తెస్తున్నారో ఏ విత్తనం పోస్తున్నారో.. ఎంతకు అమ్ముతున్నారు అనే అంశాలపై పర్యవేక్షించాలి. కాని ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు.  ప్రభుత్వ అనుమతి లేకుండా విచ్చలవిడిగా మిరప నారు అమ్ముతున్నారు. ప్రధానంగా మిరప నారు పెంపకం, అమ్మకం వ్యాపారులు చేసేదే చట్టంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వంద నర్సరీలకు మాత్రమే లైసెన్స్‌లు ఉండగా 700 నుంచి 800 నర్సరీలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి.  మిరపలో 90 శాతం హైబ్రిడ్‌ విత్తనాలను వాడుతున్నారు. కొంతమంది రైతులు హైబ్రిడ్‌ విత్తనాలను కొనుగోలు చేసి నర్సరీ యజమానికి ఇచ్చి నారు పెంచుతున్నారు. నారుపెంచినందుకు మొక్కకు 25-50 పైసల చొప్పున పారితోషికం ఇస్తున్నారు. ఎక్కువ మంది రైతులు నర్సరీ యజమాని చెప్పినట్లు నారు కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలోని రాణిబెన్నూరులో నాసిరకం హైబ్రిడ్‌ మిరప విత్తనాలను కొనుగోలు చేసి దానికి ఆకర్షణీయమైన పేరుపెట్టి స్థానికంగా నర్సరీల యజమానులు నారు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. అగ్రి, ఉద్యాన, ఏపీఎమ్‌ఐపీ అధికారులు నర్సరీలను తనిఖీ చేయడం లేదు. తాము లైసెన్స్‌లు మాత్రమే ఇస్తామని ఉద్యానశాఖ చెబుతోంది. నర్సరీలపై ఏ విభాగం అధికారుల నియంత్రణ లేకపోవడంతో నాసిరకం విత్తనా లతో నారు పెంపకం, అమ్మకాలకు అడ్డులేకుండా పోతోంది. నెల క్రితం ఉద్యానశాఖ, మార్కెటింగ్‌, అగ్రి అధికారులు నర్సరీ చట్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారా.. లేదా అని పరిశీలించడంలేదు. గత ఏడాది మిరప చీడపీడలను తట్టుకోలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిరపతోపాటు కూరగాయల నారు అమ్మకాలలో కూడా నిర్దిష్టమైన విధానం అమలు కావడంలేదు. నర్సరీ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే రైతులకే మేలని అధికారులు తెలిపారు. నర్సరీ యజమానులు  ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి అధికారులు రైతులను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  

Updated Date - 2022-07-27T05:29:17+05:30 IST