ససే‘మిరప’

ABN , First Publish Date - 2022-05-31T06:09:40+05:30 IST

ఎండుమిరప పంటకు ఏడాదిగా మార్కెట్‌లో ధరల్లేవు. దీంతో గతేడాది రైతులు పూర్తిగా నష్టపోయారు. పెద్దఎత్తున అప్పుల పాలయ్యారు.

ససే‘మిరప’

పడిపోయిన ఎండుమిర్చి ధరలు

నర్సరీల్లోనే మగ్గుతున్న నారు

భారీగా తగ్గిపోయిన సాగు

పెరిగిన మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం

నష్టాల్లో కూరుకుపోయిన నర్సరీలు


రొద్దం


ఎండుమిరప పంటకు ఏడాదిగా మార్కెట్‌లో ధరల్లేవు. దీంతో గతేడాది రైతులు పూర్తిగా నష్టపోయారు. పెద్దఎత్తున అప్పుల పాలయ్యారు. కొందరైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రస్తుత ఏడాది కూడా మార్కెట్లో ధరలు ఆశాజనకంగా లేవు. దీంతో ఈసారి పంట సాగుకు రైతులు సాహసం చేయట్లేదు. పంట పెట్టాలంటేనే జంకుతున్నారు. దీంతో నర్సరీల్లో మిరపనారు అమ్ముడుపోక మగ్గుతోంది. రొద్దం మండలంలోని రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి, మొక్కజొన్న పంటల సాగుకు మక్కువ చూపుతున్నారు.


నర్సరీల్లోనే నారు.. 

రైతులు ఎండుమిర్చి పంట సాగు చేయకపోవడంతో నర్సరీల్లో నారు మగ్గుతోంది. ఒక్కో నర్సరీలో మూడు నుంచి ఐదు లక్షలదాకా మిరపనారు వృథాగా ఉంది. దీంతో నర్సరీల  యజమానులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. ఒక్కో రైతు రెండు నుంచి మూడు ఎకరాల్లో మిరప సాగు చేసేవారు. ధరలు లేకపోవడం, కూలీల సమస్య అధికంగా ఉండటంతో పంట సాగు చేయడం లేదు.


ప్రత్యామ్నాయం వైపు..

మండలవ్యాప్తంగా మిరపసాగు వదిలేసిన రైతులు పత్తి, మొక్కజొన్న, పంటలను అధికంగా సాగు చేశారు. గతేడాది 374 ఎకరాల్లో మిరప సాగు చేయగా.. ఈసారి 130 ఎకరాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం మండలవ్యాప్తంగా పత్తి 300 హెక్టార్లలో, మొక్కజొన్న పంట 1300 హెక్టార్లలో సాగుచేశారు. పత్తి, మొక్కజొన్న ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరంలో మిరప పంట సాగుకు రూ.20 వేలు ఖర్చవుతుంది. మొక్కజొన్న సాగుకు పెట్టుబడి తక్కువ.. లాభాలు అధికంగా ఉంటుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి క్వింటాల్‌ రూ.14 వేలు, మొక్కజొన్న రూ.2350 ధర పలుకుతున్నాయి. ఎండుమిరప పది కిలోల ధర మార్కెట్‌లో రూ.500 పలుకుతోంది. ఈ లెక్కన రైతుకు పెట్టుబడి కూడా దక్కదు. రెండేళ్లుగా ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం, ఆపేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న విమర్వలు వ్యక్తమవుతున్నాయి.


అలంకారప్రాయంగా ఆర్బీకేలు..

గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా విత్తనాలు అమ్మడం, పంటలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఎన్నోమార్లు చెప్పింది. ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదు. దీంతో ఆర్బీకేలు అలంకారప్రాయంగా మారాయన్న విమర్శలున్నాయి. విత్తన వేరుశనగ, ఎరువులు, మాత్రమే రైతులకు అందించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అన్నిరకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు.


ఐదు సెంట్లకు తగ్గించా: హనుమంతప్ప, రైతు, బూచర్ల

గతేడాది ఒకటిన్నర ఎకరంలో ఎండుమిరప పంట సాగు చేసి, ధరలు లేక పూర్తిగా నష్టపోయా. ఏడాదైనా మిరపకు ధరలు రాకపోవడంతో ఈసారి ఐదు సెంట్లలో మాత్రమే పంట పెట్టా. ప్రభుత్వం మిరపకు గిట్టుబాటు ధర కల్పించాలి. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.


3 లక్షల నారు నర్సరీలోనే..: రమాదేవి, నర్సరీ నిర్వాహకురాలు

ఆర్‌.మరువపల్లిలోని తమ నర్సరీలో 3 లక్షల ఎండుమిరప నారు అమ్ముడుపోక నష్టపోయాం. ఈ ఏడాది రైతులు మిరపనారును కొనలేదు. ఆర్‌.మరువపల్లిలోని ఆరు నర్సరీల్లో 20 లక్షల నారు ఉంది. మొత్తం పడేయాల్సి వస్తోంది.


రూ.3 లక్షలు నష్టపోయా

గతేడాది నాలుగెకరాల్లో మిరప పంట సాగుచేసి, రూ.3లక్షలు నష్టపోయా. గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు పెట్టుబడులు కూడా దక్కక అప్పుల్లో కూరుకుపోయాం. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. ప్రస్తుతం కిలో మిరప మార్కెట్‌లో రూ.50 పలుకుతోంది. ఈ లెక్కన కూలీ ఖర్చులు కూడా దక్కవు.

తిరుపాల్‌నాయుడు, రైతు, ఆర్‌.కొట్టాల


Updated Date - 2022-05-31T06:09:40+05:30 IST