మొత్తానికి ట్రక్ డ్రైవర్లను వెతికి పట్టుకున్న మీరాబాయి చాను

ABN , First Publish Date - 2021-08-06T01:48:09+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చాను ఎట్టకేలకు ట్రక్ డ్రైవర్లను కనుగొనగలిగింది

మొత్తానికి ట్రక్ డ్రైవర్లను వెతికి పట్టుకున్న మీరాబాయి చాను

ఇంఫాల్: ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చాను ఎట్టకేలకు ట్రక్ డ్రైవర్లను కనుగొనగలిగింది. వెయిట్ లిఫ్టర్‌గా తాను ఎదగడానికి తొలినాళ్లలో వారే కారణమయ్యారంటూ ఒలింపిక్స్‌లో విజయం సాధించిన అనంతరం చాను వారిని గుర్తు చేసుకుంది. ఇండియాలో అడుగుపెట్టాక వారిని కలుస్తానని పేర్కొంది. అన్నట్టుగానే వారి కోసం వెతుకులాట ప్రారంభించిన చాను విజయవంతమైంది.  


నాంగ్‌పోక్ కాక్‌చింగ్ గ్రామంలోని మీరాబాయి చాను ఇంటి నుంచి ఇంఫాల్‌లోని ఖుమన్ లంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు 25 కిలోమీటర్ల దూరం. అప్పట్లో ఆమె శిక్షణ కోసం ఇంఫాల్ వెళ్లేందుకు ఇసుక ట్రక్కులను ఆశ్రయించేది. వారు కూడా ఆమెను ఎక్కించుకుని ఉచితంగా స్పోర్ట్స్ కాంపెక్స్ వద్ద దింపేవారు.


ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మీరా కుటుంబానికి ఇది చాలా వెసులుబాటును ఇచ్చింది. వారి సాయాన్ని గుర్తించుకున్న 26 ఏళ్ల మీరా చాను టోక్యో నుంచి తిరిగి వచ్చాక ఆ రోజుల్లో తనకు సాయం చేసిన ట్రక్ ట్రైవర్ల కోసం వెతుకులాట ప్రారంభించింది.


అప్పట్లో తనను ఇంఫాల్ తీసుకెళ్లిన ట్రక్ డ్రైవర్లను ఎట్టకేలకు గుర్తించిన మీరాబాయి కుటుంబం నేడు (గురువారం) గ్రామంలోని  తన నివాసంలో కొందరు ట్రక్ డ్రైవర్లను సన్మానించింది. అనంతరం వారికి బహుమానాలు అందించింది.


గ్రామంలో టీ స్టాల్ నడుపుతున్న మీరాబాయి చాను తల్లి సైఖోమ్ ఒంగ్బి టోంబి దేవి మాట్లాడుతూ.. అప్పట్లో ఇసుక ట్రక్కులు ఎథామ్ మొయిరాంగ్‌పురెల్ ప్రాంతం నుంచి వస్తూ తమ ప్రాంతం మీదుగా వెళ్లేవని గుర్తు చేసుకున్నారు. ట్రక్ డ్రైవర్లు తమ టీ దుకాణం వద్ద ఆగి తన కుమార్తెను ఎక్కించుకుని వెళ్లేవారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-06T01:48:09+05:30 IST