మినుములూరును ఆదర్శంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2022-05-20T05:57:12+05:30 IST

మండలంలో మినుములూరు పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు.

మినుములూరును ఆదర్శంగా తీర్చిదిద్దాలి
సచివాలయంలో సర్పంచ్‌ చిట్టమ్మ, కార్యదర్శి చిన్నీతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

చెత్త సేకరణకు ఆటోలు అద్దెకు తీసుకోవాలని సూచన  

పాడేరు, మే 19(ఆంధ్రజ్యోతి): మండలంలో మినుములూరు పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. గురువారం మండలంలోని మినుములూరు పంచాయతీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తొలుత చెత్త నుంచి సంపద కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. దానిని సమర్థవంతంగా వినియోగించాలని పంచాయతీ సర్పంచ్‌ చిట్టమ్మ, కార్యదర్శి చిన్నీకి సూచించారు. అలాగే పంచాయతీ పరిధిలో ప్రజల నుంచి యూజర్‌ చార్జీలను వసూలు చేయాలని, వాటితో పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఒక్కో కుటుంబం నుంచి నెలకు రూ.60 చొప్పున వసూలు చేస్తే పారిశుధ్య నిర్వహణకు ఇబ్బందులు తొలుగుతాయన్నారు. చెత్త సేకరణకు మినుములూరుకు రిక్షాలు ఇచ్చారని, కానీ గ్రామం ఎత్తుపల్లాలుగా ఉండడంతో వాటిని వినియోగించుకోలేకపోతున్నామని, ఆటోలు కావాలని సర్పంచ్‌ చిట్టమ్మ కోరారు. అందుకు కలెక్టర్‌ స్పందిస్తూ ఆటోలు అద్దెకు తీసుకోవాలన్నారు. పంచాయతీ నుంచి నెలకు రూ.5 వేలు వెచ్చిస్తే, దానికి అదనంగా తాము రూ.5 వేలు ఇస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. అలాగే పారిశుధ్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని సర్పంచ్‌.. కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌తో మాట్లాడతామని కలెక్టర్‌ అన్నారు. అలాగే పారిశుధ్య కార్మికులకు ప్రతి నెలా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలని సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. యూజర్‌ చార్జీల చెల్లింపులపై గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు వెలుగు, సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆయన గ్రామ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి పీఎస్‌ కుమార్‌, ఎంపీడీవో కేవీ నరసింహారావు, ఈవోఆర్‌డీ విజయలక్ష్మి, సర్పంచ్‌ చిట్టమ్మ, కార్యదర్శి వి.చిన్నీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-20T05:57:12+05:30 IST