మినుము.. కష్టాలు కనుము

ABN , First Publish Date - 2022-04-28T05:59:09+05:30 IST

మినుము.. కష్టాలు కనుము

మినుము.. కష్టాలు కనుము

దిగుబడి ఉన్నా ధర లేక రైతుల బెంబేలు

గత ఏడాది కంటే తక్కువ ధరకు కొనుగోలు 

సీఎం పాదయాత్ర హామీ నిలబెట్టుకోవాలని రైతుల డిమాండ్‌


మినప రైతులు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఎకరాకు సరాసరిన 6 నుంచి 7 క్వింటాళ్ల మినుము దిగుబడులు వచ్చినా.. మార్కెట్‌లో సరైన ధర లేక బేజారెత్తుతున్నారు.


గుడివాడ, ఏప్రిల్‌ 27 : జిల్లాలోని 25 మండలాల్లోనూ దాదాపు దాళ్వా లేకపోవడంతో మినుము సాగు చేపట్టారు. ప్రస్తుత రబీలో 2.34 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వాతావరణం పొడిగా ఉండటంతో దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే, క్వింటాలు మినుము కేవలం రూ.6,200 రేటు ఇస్తుండటంతో రైతుల గుండె తరుక్కుపోతోంది. గతేడాది ఇదే సమయంలో రూ.7,800 పలికిన ధర ప్రస్తుతం అత్యంత తక్కువకు చేరడంతో ఆవేదన చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. సార్వాలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎకరాకు సరాసరిన 29 బస్తాలే దిగుబడులు వచ్చాయి. మినుముతో గట్టెక్కవచ్చని ఆశించిన కౌలు రైతులు ప్రస్తుత ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. రబీలో ఎకరా మినుము సాగుకు రూ.32 వేల వరకు ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. మార్కెట్‌లో ఉన్న ధరకు మినుము అమ్ముకుంటే ఎకరాకు రూ.5 వేలు నష్టం వస్తుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మినుముకు రూ.8,500 మద్దతు ధర నిర్ణయించింది. కనీసం అది కూడా దక్కకపోవడంతో రైతులు తామే స్వయంగా క్రాప్‌ హాలిడే తీసుకునే పరిస్థితి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ధరల స్థిరీకరణ నిధితో ప్రభుత్వమే కొనాలి

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని సీఎం జగన్‌ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీని రైతులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం మార్కెట్‌ యార్డుల ద్వారా మినుము పంట కనీస మద్దతు ధర చెల్లించి, కొని ఆదుకుందని చెబుతున్నారు. సీఎం జగన్‌కు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా ధరల స్థిరీకరణ నిధులు వినియోగించి మినప పంట కొనాలని కోరుతున్నారు. మినుము ధర రోజురోజుకు దిగజారుతుండటంతో ఆలోచనలో పడ్డారు. రిటైల్‌ మార్కెట్‌లో కిలో మినప గుళ్లు రూ.120కు విక్రయిస్తున్నారు. మినపప్పు కిలో రూ.100 వంతున అమ్ముతున్నారు. ఈ ఏడాది పంట సీజన్‌లో పండిన నాణ్యమైన మినుముకు మాత్రం కేవలం రూ.6,200 ధర ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌ను తీసుకున్నా మినుముకు డిమాండ్‌ బాగానే ఉంది. గుడివాడ నుంచి వ్యాపారులు నిత్యం వంద లారీలకు పైగా మినుమును చెన్నైకు తరలిస్తున్నారు. 


క్వింటాకు రూ.10 వేలు ఉంటేనే...

నేను 25 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నాను. మినప సాగులో ఖర్చు బాగా పెరిగిపోయింది. రబీలో దిగుబడులు బాగానే వచ్చాయి. అయితే, క్వింటాకు రూ.10 వేలు ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దళారులు రేటు తొక్కి పడేస్తున్నారు. వచ్చే ఏడాది వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. - గొరిపర్తి నరసింహారావు, వెంట్రప్రగడ


ధర లేక ఇంట్లోనే పెట్టుకున్నా..  

నేను ఏడెకరాల సొంత వ్యవసాయం చేస్తున్నాను. రేటు లేకపోవడంతో సరుకును ఇంట్లోనే పెట్టుకున్నాను. రోజురోజుకు రేటు పడిపోతోంది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోకపోతే భవిష్యత్తులో క్రాప్‌ హాలిడే ప్రకటించే దుస్థితి వస్తుంది. ఖర్చు ఎకరాకు రూ.25 వేలు అవుతోంది.                - కేతినేని వీర్రాజు, లక్ష్మీపురం

Updated Date - 2022-04-28T05:59:09+05:30 IST