శాశ్వత మ్యూజియంగా మింట్‌.. దేశంలోనే తొలి ప్రదర్శన

ABN , First Publish Date - 2022-06-08T18:07:42+05:30 IST

దేశంలోనే తొలి ఓపెన్‌ మింట్‌గా సైఫాబాద్‌ మింట్‌ మ్యూజియం చరిత్ర...

శాశ్వత మ్యూజియంగా మింట్‌.. దేశంలోనే తొలి ప్రదర్శన

  • ప్రారంభించిన ఎస్‌పీఎంసీఐఎల్‌ సీఎండీ


హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : దేశంలోనే తొలి ఓపెన్‌ మింట్‌గా సైఫాబాద్‌ మింట్‌ మ్యూజియం చరిత్ర సృష్టించింది. సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ సంస్థ(ఎస్‌పీఎంసీఐఎల్‌) సీఎండీ త్రిపాఠి పాత్ర ఘోష్‌ మంగళవారం లాంఛనంగా మింట్‌ ప్రాంగంణంలోనే దీన్ని ప్రారంభించారు. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ముద్రించిన నాణాలతో పాటు కరెన్సీ, వాటిని తయారు చేసేందుకు వినియోగించిన యంత్రాలు, పరికరాలు, అప్పటి తయారీ చిత్రాలు తదితరాలను ఇందులో పొందుపరిచారు. మింట్‌ చరిత్రలో తొలి మ్యూజియం ప్రదర్శనగా ఇది నిలిచిపోతుందని, మున్ముందు శాశ్వత మ్యూజియంగా, విక్రయాల కేంద్రంగా దీన్ని మలిచే ఆలోచనలో ఉన్నామని త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా నిజాం నవాబు మనవడు నజాఫ్‌ అలీ ఖాన్‌, మింట్‌ సంస్థలో ఉన్నతాధికారులుగా పనిచేసి పదవీవిరమణ పొందిన వారిని ఘనంగా సత్కరించారు. ప్రదర్శన ఈ నెల 13 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఉంటుందని అధికారులు తెలిపారు.


మన పైసల కథ

తొలినాళ్లలో చేతితో తయారుచేసిన నాణేల నుంచి నేడు అధునాతన యంత్రాలతో రూపుదిద్దుకున్న నాణేల వరకూ అన్నీ అక్కడ కొలువుదీరాయి. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా 220 ఏళ్ల ఘన చరిత కలిగిన మన టంకశాల ఘనతను కళ్లకు కట్టేలా సైఫాబాద్‌లో ప్రారంభించిన ‘మింట్‌ ప్రదర్శన’ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు నిమిషానికి ఆరు నాణేలు అచ్చుతీసే స్థితి నుంచి ఇప్పుడు 600 నాణేలు రూపొందించే స్థాయికి హైదరాబాద్‌ మింట్‌ ఎదిగింది. కేవలం నాణేలేకాదు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పతకాలు, తితిదే, శ్రీకాళహస్తి, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాలకు చెందిన నాణేలు, అరుదైన స్మారక నాణేలు వంటివన్నీ ఇక్కడే అచ్చు అవుతున్నాయి.


- మొదటి నిజాం తండ్రి ఫిరజ్‌ జంగ్‌ వద్ద మొగల్‌ చక్రవర్తి జహంగీర్‌ కాలంలో(1613) తయారుచేసిన 11.935 కేజీల బంగారు నాణెం నమూనా చిత్రం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


- 904లో నాణేలపై చార్మినార్‌ బొమ్మను మొదటి సారి ముద్రించారు. అలాంటి అరుదైన సమాచారాన్ని సందర్శకులకు అందుబాటులో ఉంచారు. 


నిజాం నోట్లు నీళ్లపాలు

నిజాం ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా 1918 నుంచి హాలి సిక్కాలో 1000, 100, 10, 5, 1 కరెన్సీ నోట్ల చెలామణి ప్రారంభమైంది. 1922, మే 20న నిజాం నోట్లను రవాణా చేస్తున్న ఓడ ఇంగ్లీషు చానల్‌ పరిసరాల్లోని ఉషాంత్‌ ద్వీపం వద్ద నీటమునిగింది. దాంతో 51.25 లక్షల నిజాం కరెన్సీ నోట్లు నీళ్లపాలయ్యాయి.


వందేళ్ల తక్కెట రాయి

ఇప్పుడంటే బరువును కేజీలతో కొలుస్తున్నాం కానీ, వందేళ్ల కింద సేర్లతో తూచేవాళ్లు. అందుకు నిజాం రాజముద్రతో రూపొందించిన ఈ తక్కెట రాయి ఉదాహరణ.



Updated Date - 2022-06-08T18:07:42+05:30 IST