స్వాతంత్ర పోరాటంలో మైనార్టీలు

ABN , First Publish Date - 2020-08-15T10:38:26+05:30 IST

ఎందరో దేశభక్తులు బ్రిటిష్‌ సామ్రాజ్యవాద దాహానికి అడ్డుకట్ట వేయడంలో ముందుండి పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం తేవడంలో ఉమ్మడి మద్రా

స్వాతంత్ర పోరాటంలో మైనార్టీలు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 14: ఎందరో దేశభక్తులు బ్రిటిష్‌ సామ్రాజ్యవాద దాహానికి అడ్డుకట్ట వేయడంలో ముందుండి పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం తేవడంలో ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న చిత్తూరు జిల్లా గణనీయ పాత్ర పోషించింది. వందేమాతరం, హోంరూల్‌, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం తదితర ఉద్యమాల్లో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. వీరిలో పలువురు మైనార్టీలు కూడా పోరాడి ఉద్యమస్ఫూర్తిని నింపారు.


తిరుపతి వ్యాపారి మదార్‌సాహెబ్‌ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో 1922, ఫిబ్రవరి 1 నుంచి ఏడాది పాటు తమిళనాడులోని వేలూరు, కడలూరు జిల్లా జైళ్లలో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మదనపల్లె తాలూకా పెద్దపాళ్యం నివాసి షేక్‌ఇమామ్‌ శాసనోల్లంఘన ఉద్యమంలో  పాల్గొని, మూడునెలలు మద్రాస్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించారు. నేతాజీ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌లో చంద్రగిరికి చెందిన మహ్మదాలీ అఫ్జల్‌ చేరి సింగపూర్‌, బర్మాల్లో ఉంటూ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చివరికి బ్రిటిష్‌ సైన్యానికి పట్టుబడడంతో ఏడాది పాటు రంగూన్‌ జైలులో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. చంద్రగిరికి చెందిన ఆలీ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ(ఐఎన్‌ఏ)లో చేరి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1942లో బ్రిటిష్‌ సైన్యం ఆయన్ను పట్టుకుని పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం జుగార్‌కాంచ శిబిరంలో ఏడాది పాటు నిర్బంధంలో ఉంచింది.


పుంగనూరుకు చెందిన మహ్మద్‌ ఇబ్రహీం 20వఏట బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో పోరాడేందుకు బ్రిటిష్‌ సైన్యం సింగపూర్‌ పంపగా జపాన్‌ చేతికి బందీగా చిక్కారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అజాద్‌ హింద్‌ఫౌజ్‌లో చేరి దేశం కోసం పోరాడారు. నేతాజీ సేన లొంగుబాటుతో జైలుశిక్ష కూడా అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చారు. ఇలా ఎందరో ముస్లిం మైనార్టీలు స్వాత్రంత్రోద్యమ పోరాటంలో తమ వంతు సేవలందించి చరిత్రలో చిరస్థారుుగా నిలిచి పోయారు. 

Updated Date - 2020-08-15T10:38:26+05:30 IST