దూకుడు..!

ABN , First Publish Date - 2022-05-13T06:24:38+05:30 IST

దూకుడు..!

దూకుడు..!
యువకులకు పోలీసుల కౌన్సెలింగ్‌ (ఫైల్‌)

మైనర్లే.. మేజర్‌ ప్రమాదాలు 

నగరంలో యథేచ్ఛగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

రద్దీ రహదారులపై జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌

రోజూ పోలీసులకు చిక్కుతున్న 100 మంది

కౌన్సెలింగ్‌ ఇచ్చినా మారని తీరు

నిర్లక్ష్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమంటున్న కాప్స్‌


ఇద్దరు మైనర్లు స్కూటర్‌పై వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్నారు. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న వ్యక్తి, మైనర్లలో ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో మైనర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మైలవరం-తిరువూరు రహదారిపై కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదం ఇది. ఈ ప్రమాదం ఒక కుటుంబాన్ని అనాథను చేసింది. మరో రెండు కుటుంబాల్లో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది.

ఒక్కసారిగా బైక్‌ హ్యాండిల్‌ అటూ ఇటూ తిప్పుతారు. సైడ్‌ స్టాండ్‌ను కిందకు నొక్కి రోడ్డును నాశనం చేస్తూ నిప్పులు సృష్టిస్తారు. వింతవింత హారన్లతో విసుగెత్తిస్తారు. త్రిబుల్‌ రైడింగ్‌తో పక్కనున్న వారికి హడలెత్తిస్తారు. రెప్పపాటు సమయంలో రయ్యిన దూసుకుపోతారు. వన్‌ వేలో ఎదురు చూసుకోకుండా ఎగురుకుంటూ వస్తారు. అత్యుత్సాహంతో నగరంలోని రహదారులపై మైనర్‌ యువకులు చేస్తున్న ప్రమాదకర విన్యాసాలివి. ఎంజాయ్‌మెంట్‌ మత్తులో చేస్తున్న ఈ విధ్వంసంలో వారితో పాటు అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

బైక్‌ ఎక్కగానే మైనర్లు మైమరిచిపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు మస్కా కొట్టి బైకులు ఎక్కుతుంటే, మరికొంతమందిని తల్లిదండ్రులే దగ్గరుండి ఎక్కిస్తున్నారు. రోడ్డెక్కితే చాలు వెనుకా ముందు చూసుకోకుండా రయ్యిరయ్యిన నడిపేస్తున్నారు. ఈ మైనర్ల డ్రైవింగ్‌ ఇప్పుడు విజయవాడ నగరాన్ని గడగడలాడిస్తోంది. స్నేహితులతో కలిసి నగరంలో రద్దీ రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నా, ఎదురుగా పోలీసులు కనిపిస్తున్నా ఎలాంటి భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌లతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. జాతీయ రహదారులపై వ్యతిరేక మార్గంలో వాహనాలను నడిపి ఎదురుగా వస్తున్న వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న మైనర్ల డ్రైవింగ్‌ వ్యవహారం ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. 

రోజుకు 100 మందికి పైనే..

నగరంలో ఆరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలోని సిబ్బంది నిత్యం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై జరిమానాలు విధిస్తున్నారు. ఇలా చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా మైనర్లు దొరుకుతున్నారు. నగరం మొత్తం మీద రోజుకు 100 మందికి పైగా మైనర్లు చిక్కుతున్నారు. వారిలో ఎక్కువ మంది లైసెన్స్‌ లేకుండా ఉన్నవారే.  ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడం, నిర్దేశిత వేగానికి మించి వాహనాలు నడపడం కారణంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ వద్ద పటమటలంకలోకి వచ్చే సబ్‌వే, వారధి వద్ద నుంచి పశువుల ఆస్పత్రి వీధిలోకి వచ్చే మార్గం, కృష్ణలంక, బాలాజీనగర్‌, రాణిగారితోట ప్రాంతాల నుంచి సాయిబాబా మందిరం వద్ద వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ డ్రైవ్‌లో చిక్కిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బైకును స్వాధీనం చేసుకుంటున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడిపిన వారికి రూ.500, త్రిబుల్‌ రైడింగ్‌ చేసిన వారికి రూ.200ను జరిమానాగా విధిస్తున్నారు. అయినా మైనర్లలో మార్పు కనిపించట్లేదు.


నిర్లక్ష్యంతోనే ఇలా..

బైకులు, స్కూటర్లతో మైనర్లు రద్దీ రహదారులపై షికార్లు చేయడానికి ప్రధాన కారణం నిర్లక్ష్యం. ఇది తీసుకొచ్చే ప్రమాదాన్ని వారు గుర్తించట్లేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా మరో కారణం. కౌన్సెలింగ్‌లో ఈ రెండు అంశాలను గుర్తించాం. త్రిబుల్‌ రైడింగ్‌ చాలా ప్రమాదకరం. చాలామంది మైనర్లు ఇదే చేస్తున్నారు. బైకుపై చివర్లో కూర్చున్న వ్యక్తి ఏమాత్రం కదిలినా డ్రైవ్‌ చేస్తున్న వారు కంట్రోల్‌ తప్పుతారు. ఎదురుగా ఉన్న వాహనాన్నో, పక్కన ఉన్న డివైడర్‌నో ఢీ కొడతారు. ఈ ప్రమాదంలో ముందుగా గాయపడేది చివర్లో కూర్చున్న వ్యక్తే. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొత్త ఆదేశాలు ఇచ్చింది. వాటిని మైనర్లకు వివరిస్తున్నాం. - వాసు, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రోడ్‌ సేఫ్టీ ప్రతినిధి





Read more