Abn logo
Oct 1 2020 @ 01:38AM

హత్రాస్ ఘటన మరువక ముందే మరో దారుణం

Kaakateeya

ఖర్ఘాన్, మధ్యప్రదేశ్: హత్రాస్ ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఖర్ఘాన్ జిల్లాలో మైనర్ బాలికను ముగ్గురు దుర్మార్గులు కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరుఘార్ ప్రాంతంలోని బాధితురాలి ఇంటికి మంగళవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు వెళ్లి నీళ్లు ఇవ్వమంటూ అడిగారు. బాధితురాలు మంచినీళ్లను ఇస్తుండగా ఆమెను బలవంతంగా బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. 

ఇదే సమయంలో తన సోదరిని కాపాడేందుకు బాధితురాలి సోదరుడు ప్రయత్నించినప్పటికి లాభం లేకపోయింది. ముగ్గురు నిందితులు బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయారు. బాధితురాలి సోదరుడు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. 

కాగా.. యూపీలోని హత్రాస్‌లో చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. హత్రాస్‌లో రెండు వారాల క్రితం ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యాచారం చేయడమే కాకుండా నాలుక కోసేసి, వెన్నెముక విరిచేసి అత్యంత పైశాచికంగా హింసించారు. చివరికి కొనఊపిరితో ఉండగా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించగా రెండు వారాల పాటు ప్రాణం కోసం పోరాడి మంగళవారం తుది శ్వాస విడించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. 2012లో నిర్భయ ఘటనపై దేశం ఎలా అట్టుడికిపోయిందో.. ప్రస్తుతం ఈ ఘటన కూడా దేశ ప్రజల్లో అదే స్థాయి ఆగ్రహావేశాలను రగిలిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement