గత కంటే మిన్న

ABN , First Publish Date - 2022-01-21T07:29:20+05:30 IST

వానాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. జిల్లా యంత్రాంగం రికార్డుస్థాయిలో ధాన్యం సేకరించింది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ గత సీజన్‌ కంటే కూడా అధికంగా రైతుల వద్ద ధాన్యాన్ని అధికారులు సేకరించారు.

గత కంటే మిన్న
భువనగిరి మండలంలోని ఓ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని సేకరిస్తున్న నిర్వాహకులు

 జిల్లాలో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు 

 35,734 మంది రైతుల నుంచి 2.78లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ 

 రికార్డు స్థాయిలో కొనుగోలు చేసిన జిల్లా యంత్రాంగం 

వానాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. జిల్లా యంత్రాంగం రికార్డుస్థాయిలో ధాన్యం సేకరించింది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ గత సీజన్‌ కంటే కూడా అధికంగా రైతుల వద్ద ధాన్యాన్ని అధికారులు సేకరించారు. 

ఆంధ్రజ్యోతి-యాదాద్రి

జిల్లాలో ఈసారి మొత్తం 2.60 ఎకరాల్లో వరి సాగు చేశారు. 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని, దాదాపు 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనావేశారు. జిల్లాలో మొత్తం 279 ధాన్యం కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 184, ఐకేపీ 91, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు ఏ-గ్రేడ్‌ రకానికి రూ.1960, బీ-గ్రేడ్‌కు రూ.1940గా నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 35,734 మంది రైతుల నుంచి 2.78 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ కేంద్రాల ద్వారా 92,218.197 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌ ద్వారా 1,67,214.940 మెట్రిక్‌ టన్నులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కేంద్రాల్లో 6,926 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే 2021 వానాకాలం సీజన్‌లో మొత్తం 2.05లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, గత సీజన్‌కంటే ఈసారి 73 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేశారు. అయితే ఈసారి వరి గతం కంటే అధిక మొత్తంలో దిగుబడి వచ్చింది. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే, దాదాపు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు సేకరించే అవకాశం ఉండేది. 


రైతులకు రూ.372కోట్లు చెల్లింపులు

కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో మొత్తం 2.78లక్షల మెట్రిక్‌ ధాన్యాన్ని రూ.539కోట్లతో కొనుగోలు చేశారు. రైతులు విక్రయించిన ధాన్యానికి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌కు బిల్లులు అందిన తర్వాత 72 గంటల్లో డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. అయితే జిల్లాలో ఇప్పటివరకు రూ.372కోట్ల మేరకు రైతులకు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో రూ.162 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. 

 

10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలింపు

జిల్లాలోని గోదాములు, రైస్‌ మిల్లులన్నీ సేకరించిన ధాన్యంతో నిండిపోయాయి. తమ వద్ద స్థలం లేదని, మిల్లులకు పంపవద్దని రైస్‌ మిల్లర్లు చేతులెత్తేశారు. దీంతో రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని సూర్యాపేట జిల్లాలో ఖాళీగా ఉన్న రైస్‌మిల్లులకు తరలించారు. ఇప్పటివరకు జిల్లాకు చెందిన దాదాపు 10వేలకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సూర్యాపేటకు తరలించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం కావడంతో పలు ప్రాంతాల్లో రైతులు కమీషన్‌ ఏజెంట్లు, దళారులను ఆశ్రయించారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర క్వింటాకు ఏ-గ్రేడ్‌ రకానికి రూ.1960, బీ-గ్రేడ్‌ రకానికి రూ.1940 ఉండగా, కమీషన్‌ ఏజెంట్లు, దళారులు రైతుల వద్ద క్వింటాకు రూ.1300 నుంచి రూ.1400వరకు కొనుగోలు చేశారు. జిల్లాలో దాదాపు 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో రైతులు క్వింటా ధాన్యానికి దాదాపు రూ.400నుంచి రూ.500వరకు నష్టపోయారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోనే ఆరుగాలం శ్రమించిన రైతాంగం మద్దతు ధరను కోల్పోయిందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 


రూ.539 కోట్ల ధాన్యం కొనుగోలు : గోపీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ 

వానాకాలంలో రైతులు పండించిన 2.78లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం 279 కేంద్రాల ద్వారా రూ.539కోట్ల వ్యయంతో కొనుగోలుచేశాం. ఇప్పటివరకు రైతులకు రూ.372 కోట్ల మేరకు చెల్లించాం. మిగతా రైతులకు ప్రభుత్వం మంజూరు చేయగానే బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తాం. జిల్లాలోని గోదాములు, రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు నిండిపోయాయి. దీంతో ధాన్యాన్ని సూర్యాపేట జిల్లాలోని గోదాములు, మిల్లులకు దాదాపు 10వేల మెట్రిక్‌ టన్నులు తరలించాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా జిల్లాయంత్రాంగం కొనుగోళ్లు చేపట్టింది.  

Updated Date - 2022-01-21T07:29:20+05:30 IST