పెద్దగట్టు జాతరలో మంత్రుల ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-03-01T20:05:35+05:30 IST

జిల్లాలోని దూరాజ్‌పల్లిలో జరుగుతున్న పెద్దగట్టు లింగమంతుల జాతరలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సందడి చేశారు.

పెద్దగట్టు జాతరలో మంత్రుల ప్రత్యేక పూజలు

సూర్యాపేట: జిల్లాలోని దూరాజ్‌పల్లిలో జరుగుతున్న పెద్దగట్టు లింగమంతుల జాతరలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సందడి చేశారు. జాతరకు హాజరైన మంత్రులు ఇరువురూ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా పచ్చగా సస్యశ్యామలం అయింది. రైతుల సంతోషం ఈ జాతరలో కనిపిస్తోందన్నారు. యాదవ సోదరులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ, అభిమానాలు ఉన్నాయని చెప్పారు. అందుకే ఈ జాతరకు కోట్లరూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేశారని తెలిపారు. పెద్దగట్టు జాతరకు వివిధ రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని చెప్పారు. 


ముఖ్యమంత్రి ఆదేశాలతో జాతరలో సకల సదుపాయాలను కల్పించామన్నారు. 24గంటలూ తాగునీరు,విద్యుత్‌  సదుపాయాన్నికల్పించామన్నారు. గుట్ట చుట్టుపక్కల 50 ఎకరాల్లో భక్తులు పార్కింగ్‌కి, వంటలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జాతర కన్నుల పండువుగా ఘరంగా జరుగుతోందన్నారు. కాళేశ్వరం జలాలను పెద్దగట్టుకు తెప్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి యాదవులు రుణపడి ఉంటారన్నారు. అహర్నిశలూ కృషి చేసి పకడ్బందీ ఏర్పాట్లు చేశారని తెలిపారు. యాదవుల ఇలవేల్పు లింగమంతుల స్వామి రాష్ర్టాన్నిమరింత సుభిక్షం చేయాలని కోరుకున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-03-01T20:05:35+05:30 IST