అంగన్ వాడీ విద్యను మరింత పటిష్టంగా అమలు చేస్తాం

ABN , First Publish Date - 2021-12-03T00:53:04+05:30 IST

రాష్ట్రంలో అంగన్ వాడీ విద్యను పటిష్టం చేయడం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చెప్పారు.

అంగన్ వాడీ విద్యను మరింత పటిష్టంగా అమలు చేస్తాం

హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్ వాడీ విద్యను పటిష్టం చేయడం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్య లేని లోటును గమనించిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నర్సరీ విద్య కూడా అందించాలని ఉద్దేశ్యంతో అంగన్ వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించడం వల్ల నర్సరీ నుంచి నేరుగా ప్రాథమిక విద్యకు విద్యార్థులను సంసిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. 


అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంయుక్త నిర్వహణపై గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో రెండు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అంగన్ వాడీ కేంద్రాలు అంటే కేవలం పౌష్టికాహారం అందించడానికే పరిమితం కాదని, అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్.కే.జి, యు.కే.జీ విద్య అందించడంతో పాటు పిల్లలను ప్రాథమిక విద్య కొనసాగించడానికి ముందునుంచే పాఠశాలలకు పరిచయం చేయాలని, తద్వారా మధ్యలో బడి మానేయడాన్ని కట్టడి చేయాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. 


ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్ వాడీ కేంద్రాలలో ఇప్పటికే  15,167 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్నాయని తెలిపారు. 11,185 అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు ఉండగా, 12,174 కేంద్రాలు కిరాయి లేకుండా ఇతర భవనాలల్లో నడుస్తున్నాయని, మరో 12,219 కేంద్రాలు కిరాయి భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటగా కిరాయి భవనాల్లో నడుస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించాలని, త్వరలోనే దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపడుతామని చెప్పారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య దేవరాజన్, విధ్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T00:53:04+05:30 IST