జె.పి దర్గా, మక్కా మసీదు పనులను త్వరితగతిన పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-08-28T23:15:18+05:30 IST

చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీలు అధికారులను ఆదేశించారు.

జె.పి దర్గా, మక్కా మసీదు పనులను త్వరితగతిన పూర్తి చేయండి

హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని  మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీలు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు  జె.పి,మౌలాలీ,పహాడీ షరీఫ్ దర్గాలు, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులు... అజ్మీర్ దర్గా వద్ద రుబాత్, కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణాలకు నెలకొన్న అడ్డంకులను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వీటికి సంబంధించి శనివారం మంత్రులు నాలుగు గంటల పాటు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమ సమయంలో జె.పి దర్గా వద్ద పార్టీ ముఖ్యులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని చెప్పిన విషయాన్ని మంత్రులు గుర్తు చేసుకున్నారు.


రాష్ట్రం ఏర్పడిన తర్వాత దర్గాను సందర్శించి దీని విస్తరణ, అభివృద్ధికి 50కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. భూసేకరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని, సంబంధిత వ్యాపారులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆదేశించారు.అజ్మీర్ దర్గా వద్ద రుబాత్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా అధికారులను కోరారు.నగరంలో వక్ప్ బోర్డు కు చెందిన 11విలువైన ఆస్తులను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా లీజుకు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి త్వరలో మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు.పహాడీషరీఫ్ దర్గా వద్ద ర్యాంప్,సిసి రోడ్డు, మౌలాలీ దర్గా, మక్కా మసీదు,అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా కొప్పుల ఈశ్వర్,మహమూద్ అలీలు అధికారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - 2021-08-28T23:15:18+05:30 IST