మేడారం జాతరను ఘనంగానిర్వహించడానికి ఏర్పాట్లు: మంత్రుల సమీక్ష

ABN , First Publish Date - 2022-01-29T20:26:54+05:30 IST

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

మేడారం జాతరను ఘనంగానిర్వహించడానికి ఏర్పాట్లు: మంత్రుల సమీక్ష

ములుగు: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శనివారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శాశ్వత ప్రాతిపదికన మేడారంలో పనులు చేపట్టినట్టు తెలిపారు. మేడారం మహాజాతరకు కోటి ముప్పై లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.ప్రతీ భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ఆదివాసీల అభిప్రాయాలకు గౌరవం ఇస్తామని, వారి సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా చూస్తామన్నారు.కానీ కొందరు జాతరను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. 




అయినా ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగానే జాతర నిర్వహిస్తుందన్నారు. కాగా జాతర ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా నిధులు రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రద్ధతో జాతర నిర్వహణకు ఆదేశించారని చెప్పారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మేడారం మహాజాతర  కోసం ప్రభుత్వం 350కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే కొన్ని డిపార్ట్ మెంట్లలో పనులు పూర్తయ్యాయి, ఇంకా మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. జాతరకు వచ్చే  భక్తుల కోసం 4వేల బస్సులు, పదివేల మంది సిబ్బందితో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 


జంపన్న వాగులో స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామని, ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని మంత్రి వివరించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.ఆందోళన చేస్తున్న ఆదివాసి సంఘాలతో మాట్లాడతామని కూడా మంత్రి వెల్లడించారు. కాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆదివాసి సంప్రదాయాలకు అనుగుణంగా జాతర నిర్వహిస్తామని స్పష్టం చేశఆరు. పూజారుల మనోభావాలు గౌరవిస్తామని, ఆదివాసి, గిరిజన ఆరాధ్యదైవమైన జాతరకు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగనివ్వమని,అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. 

Updated Date - 2022-01-29T20:26:54+05:30 IST