విజయనగరం: చౌడువాడలో యువతిపై పెట్రోల్ దాడి.. దురదృష్టకరమని మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ అన్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడన్నారు. దిశ యాప్ కారణంగానే బాధితులను సకాలంలో కాపాడగలిగామని తెలిపారు. యాప్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారని చెప్పారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. చీటికీ.. మాటికీ.. ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేయడం తగదని మంత్రులు హితవుపలికారు.