మంత్రి x ఎంపీ

ABN , First Publish Date - 2022-05-14T06:54:26+05:30 IST

అనకాపల్లిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు తరచూ బయట పడుతున్నాయి.

మంత్రి x ఎంపీ

వైసీపీలో పోస్టర్‌ వార్‌

సత్యవతి, అమర్‌ల మధ్య ముదిరిన విభేదాలు

గౌరీపరమేశ్వరుల ఆలయ ప్రారంభోత్సవ పోస్టర్‌ విషయంలో బహిర్గతం

ఇద్దరి ఫొటోలతో పోస్టర్లు ముద్రించిన ఆలయ కమిటీ 

ఆమె ఫొటో తొలగిస్తేనే ఉత్సవాలకు హాజరవుతానని

అమర్‌ తన అనుచరులకు చెప్పినట్టు ప్రచారం

ఆలయ కమిటీకి చేరిన సమాచారం

ఎంపీ ఫొటో లేకుండా మళ్లీ పోస్టర్లు ముద్రణ


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు తరచూ బయట పడుతున్నాయి. తాజాగా గౌరీపరమేశ్వరుల దేవాలయం ప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాల పోస్టర్‌ విషయంలో ఎంపీ సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పోస్టర్‌పై ఎంపీ ఫొటో తొలగిస్తేనే ఉత్సవాలకు హాజరవుతానని మంత్రి...తన అనుచరులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఉత్సవ కమిటీకి చేరడంతో ఎంపీ సత్యవతి ఫొటో లేకుండానే మళ్లీ పోస్టర్లను ముద్రించారు.

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ బీవీ సత్యవతిల మధ్య కొంతకాలం నుంచి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. పార్టీకి చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నేతలు రెండు వర్గాలుగా విడిపోయి చెరో పక్షం నిలవడంతో అంతర్గత విభేదాలు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. కానీ ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు. తాజాగా అనకాపల్లి వేల్పులవీధిలో గౌరీపరమేశ్వరుల దేవాలయం ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలకు సంబంధించి ఆలయ కమిటీ ముద్రించిన పోస్టర్‌పై ఫొటోల విషయంలో రగడ మొదలైంది. శుక్రవారం నుంచి ఆదివారం  వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌పై ఎంపీ సత్యవతి ఫొటో వేయడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారనే ప్రచారం పార్టీలో జరుగుతున్నది. ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ సత్యవతి ఫొటోలతో పోస్టర్లను ముద్రించారు. ఇద్దరి ఫొటోలు ఒకే పరిమాణంలో, సమాంతర ప్రదేశంలో ముద్రించడం మంత్రికి నచ్చలేదని ఆయన వర్గీయుల ద్వారా తెలిసింది. పోస్టర్‌లో ఆమె (ఎంపీ సత్యవతి) ఫొటో తొలగిస్తేనే ఉత్సవాలకు హాజరవుతానని అమర్‌నాథ్‌ తను అనుచరుల వద్ద స్పష్టంచేసినట్టు సమాచారం. ఈ విషయం ఉత్సవ కమిటీ దాకా వెళ్లింది. దీంతో ఎంపీ సత్యవతి ఫొటో లేకుండా ఆగమేఘాల మీద కొత్త పోస్టర్లను ముద్రించారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఉత్సవాల పోస్టర్లపై మంత్రితోపాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ముద్రిస్తారని ఎంపీ వర్గీయులు చెబుతున్నారు.

ఆది నుంచి ఎడమొహం పెడమొహం

గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన డాక్టర్‌ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్‌నాథ్‌...ఆది నుంచి అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ముఖ్యంగా రేషన్‌ బియ్యం వ్యవహారం ఇద్దరి మధ్య అంతరాన్ని బాగా పెంచింది. గతంలో ఎంపీ సత్యవతి ట్రస్టు కార్యాలయ భవనం వద్ద రేషన్‌ బియ్యం పట్టుబడడం, దీనిపై మీడియాలో విస్తృత ప్రచారం జరగడం వెనుక అప్పట్లో అమర్‌నాథ్‌ హస్తం వున్నట్టు ఎంపీ వర్గీయులు భావించారు. అంతేకాకుండా అమర్‌ వర్గీయులు రేషన్‌ బియ్యం వ్యవహారంపై సీఎంకు కూడా ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. కాగా మంత్రి అమర్‌నాథ్‌ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎంపీ సత్యవతి ఇటీవల ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.  

కాగా వేల్పులవీధిలో గౌరీపరమేశ్వరుల దేవాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి రెండు రకాల పోస్టర్లను ముద్రించడంపై ఆలయ కమిటీ అధ్యక్షుడు ముక్తా ఈశ్వరరావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా... పోస్టర్ల ముద్రణ విషయం తనకు తెలియదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలయ ప్రాంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. 


Read more