కష్టాల్లో కక్ష సాధింపులా?

ABN , First Publish Date - 2021-05-12T15:55:11+05:30 IST

విజయవాడ..

కష్టాల్లో కక్ష సాధింపులా?
దేవి, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

అధిష్ఠానం చొరవతో సింహాచలం ట్రస్టు బోర్డులో సభ్యురాలిగా దాడి దేవి

కక్షగట్టి ట్రస్టు నుంచి తొలగించిన మంత్రి

హైకోర్టును ఆశ్రయించడంతో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు

మంత్రితోపాటు ప్రభుత్వానికీ ఎదురుదెబ్బ!


విజయవాడ - ఆంధ్రజ్యోతి: కరోనా కష్టకాలంలో ప్రజారోగ్యంపై దృష్టి సారించాల్సిన నేతలు ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. సొంత పార్టీ నేతలపైనే కత్తులు దూస్తున్నారు. అందుకు నిదర్శనమే సింహాచలం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన దాడి దేవి తొలగింపు. ఎలాంటి కారణం చూపకుండా తనను తొలగించడంపై దేవి హైకోర్టును ఆశ్రయించడంతో ఆమెను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంత్రితోపాటు పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది. అసలు సొంత పార్టీనేతలపైనే కక్షసాధింపునకు దిగాల్సిన అవసరం మంత్రికి ఎందుకొచ్చింది?


విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన దాడి అప్పారావు, దాడి జగన్‌ సోదరులు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 2016లో వెలంపల్లి శ్రీనివాస్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జిగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఎదుగుతూ వచ్చారు. దీనికి సమాంతరంగానే దాడి అప్పారావు వర్గాన్ని వెలంపల్లి మొదటి నుంచి దూరం పెడుతూ వచ్చారు. అప్పారావు వర్గం కూడా మంత్రి అక్రమాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి సమాచారం తెలియజేయడం, మంత్రి వ్యతిరేక వర్గీయులతో సమావేశాలు నిర్వహించడం చేస్తూ వచ్చారు. అప్పారావును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించేందుకు వెలంపల్లి ప్రయత్నాలు ఫలించలేదు.


పైగా కార్పొరేటర్‌ సీటు రాకుండా అడ్డుకున్నారని, పార్టీనే నమ్ముకున్న తనకు న్యాయం చేయాలని అప్పారావు సోదరులు పెద్దలకు మొరపెట్టుకున్నారు. దీంతో అప్పారావు సోదరుడు జగన్‌ సతీమణి దేవికి సింహాచలం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చింది అధిష్టానం. చైర్మన్‌, ఎక్స్‌- అఫిషియో సభ్యులు కాకుండా 15 మంది సభ్యులతో గత ఏడాది ఫిబ్రవరి 20న సింహాచలం ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశారు. మరో 10నెలల్లో పదవీకాలం ముగుస్తుండగా మంత్రి ఆమెను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇప్పించారని ప్రచారం ఉంది. దేవి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెను ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగించాలని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 


అధిష్ఠానాన్ని కాదని.. 

మంత్రి వెలంపల్లి ఒంటెద్దు పోకడలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి చాలాసార్లు అసహనం వ్యక్తం చేశారు. కానీ వెలంపల్లి తానే రాజు.. తానే మంత్రి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరితో తాజాగా ఆయనతోపాటు ప్రభుత్వం కూడా హైకోర్టులో ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాసులకే సీట్లు దక్కాయన్న ఆరోపణలున్నాయి. పైగా బీసీలను అణగదొక్కుతున్నారన్న ప్రచారం ఉంది. దీంతో వారు ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి, వైవీ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. అప్పారావు సోదరులు పార్టీకి విధేయులని విశ్వసించడంతో అప్పారావు సోదరుడు జగన్‌ సతీమణికి సింహాచలం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా, దాడి అప్పారావును గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమించింది. అవకాశం కోసం ఎదురుచూసి మంత్రి కోటరీ వేటు వేసింది. పైగా దేవి భర్త జగన్‌ కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో కక్షసాధింపులపై ఆవేదనతో జగన్‌ ఓ వీడియోని అధిష్ఠానానికి పంపారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Updated Date - 2021-05-12T15:55:11+05:30 IST