6వ తేదీ నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ- తలసాని

ABN , First Publish Date - 2020-08-04T23:55:10+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుంచి నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు పశుసంవర్దక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

6వ తేదీ నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ- తలసాని

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుంచి నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు పశుసంవర్దక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్ర మాన్నిలాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. అదే రోజు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం మడిగట్ల గ్రామంలోని మడికాని చెరువు, కోడూర్‌ గ్రామంలోని మైసమ్మ చెరువులో జిల్లాకు చెందిన ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, దేవరకద్ర, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేస్తామని చెప్పారు. అనంతరం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామంలోని వెంకటాయకుంటలో మంత్రి సబితారెడ్డి స్ధానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి చేపపిల్లలను విడుదల చేస్తారు. 


రాష్ట్రవ్యాప్తంగా 24వేల రిజర్వాయర్‌లు, చెరువులలో 50కోట్ల రూపాయల ఖర్చుతో 81కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అదే విధంగా 10 కోట్ల రూపాయల ఖర్చుతో 5కోట్ల రొయ్య పిల్లలను కూడా చెరువుల్లోకి విడుదల చేయనున్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీఛైర్మన్‌లకు వ్యక్తిగతంలో లేఖలు కూడా పంపారు. 


చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ సభ్యులు పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపధ్యంలో చేప పిల్లల విడుదల సమయంలో 25 మందికి మించి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్‌లు, మాస్క్‌లు ధరించాలని సూచించారు.  

Updated Date - 2020-08-04T23:55:10+05:30 IST