Abn logo
Sep 24 2021 @ 11:20AM

ఆ స్థలాలు వారికే..?

రెగ్యులరైజేషన్‌కు ప్రణాళికలు రూపొందించాలి

కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో చర్చిస్తాం

పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండండి

రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులకు తలసాని సూచన


హైదరాబాద్‌ సిటీ: దీర్ఘకాలంగా ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు, చిన్న ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న వారి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్‌ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో 2304 మందికి 2,07,449 చదరపు గజాల స్థలం లీజుకు ఇచ్చామని, ఇందులో 1740 స్థలాల రెగ్యులరైజేషన్‌ కోసం జీఓ-816 కింద దరఖాస్తులు రాగా, 1472 స్థలాలను క్రమబద్ధీకరించారని చెప్పారు. మరో 56 స్థలాలకు సంబంధించి రుసుము చెల్లించక దరఖాస్తులు పక్కన పెట్టారని, 215 స్థలాల కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని తెలిపారు. ఇతర కారణాలతో 511 స్థలాల రెగ్యులరైజేషన్‌ పెండింగ్‌లో ఉందన్నారు. నూతన విధి విధానాల ప్రకారం అప్పటి ధరను పరిగణనలోకి తీసుకొని రెగ్యులరైజ్‌ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని జీరా కాంపౌండ్‌లో 134 గృహాలు ఉన్నాయని, 1994లో జీఓ-816 కింద రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జీఓ గడువు ముగియడంతోనే దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారని, నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న 485 మునిసిపల్‌ సర్వీస్‌ క్వార్టర్లనూ రెగ్యులైలరైజ్‌ చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. సుల్తాన్‌షాహీ, హైదర్‌బస్తీ, న్యూ బోయిగూడ ప్రాంతాల్లో జీఓ-58 ప్రకారం రెగ్యులరైజ్‌ చేయాలని జీహెచ్‌ంసీ కమిషనర్‌ రెవెన్యూ విభాగానికి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇచ్చారని చెప్పారు. ఆదయ్య నగర్‌లో 380, రాంగోపాల్‌పేటలో 691, న్యూ బోయిగూడలో 66తో కలిపి మొత్తం 1047 ఇళ్లను అప్పటి ధర ప్రకారం రెగ్యులరైజ్‌ చేయనున్నట్టు చెప్పారు. నామమాత్రపు వడ్డీ రుసుముతో రెగ్యులరైజ్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ సుముఖంగా ఉన్నా లబ్ధిదారులు రిజిస్ర్టేషన్‌ చేయాలంటున్నారని చెప్పారు. జీరా కాంపౌండ్‌లోని దేవాదాయ శాఖకు చెందిన 2350 చ.మీల స్థలంలో 70 మంది ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారని, ప్రభుత్వం వీరికి విద్యుత్‌, రోడ్డు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించిందన్నారు. మున్ముందు ఇబ్బందులు లేకుండా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, సీసీఎల్‌ఏ అసిస్టెంట్‌ సెక్రటరీ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...