డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల్లోనే బస్తీదవాఖానాలు ఏర్పాటు: Talasani

ABN , First Publish Date - 2022-05-05T23:15:36+05:30 IST

పేద ప్రజల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో బస్తీ దవాఖానా లు, అంగన్ వాడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల్లోనే బస్తీదవాఖానాలు ఏర్పాటు: Talasani

హైదరాబాద్: పేద ప్రజల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో బస్తీ దవాఖానా లు, అంగన్ వాడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి హౌసింగ్, రెవెన్యూ, GHMC అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేక, ఇరుకు ఇండ్లలో పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కార్యక్రమం కార్యరూపం దాల్చిందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో రోడ్లు, డ్రైనేజి, త్రాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హైదరాబాద్ జిల్లా పరిధిలోని 22 ప్రాంతాలలో నిర్మించి అర్హులైన పేదలకు ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. 


వారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం కోసం ఆయా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో బస్తీ దవాఖానా లను ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సహకారంతో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ లో నివసిస్తున్న పిల్లల సంరక్షణ కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల సహకారంతో అంగన్ వాడి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖాన, అంగన్ వాడి కేంద్రాల ఏర్పాటుకు ఆయా కాలనీ లలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ సందర్బంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అర్హులైన లబ్దిదారులకు కేటాయించగా మిగిలిన ఇండ్ల కేటాయింపు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ లలో నిర్మించిన షాప్ ల కేటాయింపు లపై అధికారులతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. 


అర్హత ఉన్నా తమకు ఇండ్లు రాలేదని అనేక మంది తన వద్దకు వస్తున్నారని, వారిలో అర్హులైన వారు ఉంటే గుర్తించి ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో ఏర్పాటు చేసిన లిఫ్ట్ లు, కాలనీ నిర్వహణ అవసరాల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో షాప్ లను నిర్మించడం జరిగిందని తెలిపారు. నేటి వరకు షాప్ లను కేటాయించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయని, వెంటనే వాటిని అర్హులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని GHMC అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హమాలీ బస్తీ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆ ప్రాంత ప్రజల జీవనస్థితిని చూసి చలించిపోయి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. 



ప్రభుత్వం నుండి నిధులు మంజూరైనాయని, స్థానిక ప్రజల అభ్యంతరాల కారణంగా నేటి వరకు పనులు చేపట్టలేకపోయినట్లు వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే బస్తీ వాసులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ RDO వసంత, హౌసింగ్ CE సురేష్, EE వెంకటదాసు రెడ్డి, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్ తహసిల్దార్ లు బాల శంకర్, అయ్యప్ప, మహ్మద్ అన్వర్, భూ సేకరణ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ముకుంద రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read more