హైదరాబాద్: ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల హమాలీ బస్తీలో బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు.ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని బస్తీవాసులు మంత్రిని ప్రశ్నించారు.ఈ విషయంలో రైల్వే అధికారులు తీసుకున్న చర్యలు సరికాదని, వెంటనే రహదారిని తెరిచి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చాలని మంత్రి తలసాని రైల్వే అదికారులను కోరారు. ఉన్నఫళంగా రహదారులను ఎలా మూసి వేస్తారని ఆయన ప్రశ్నించారు.
మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులను మంత్రి తలసానిఆదేశించారు. రైల్వే అధికారులు రహదారులను మూసి వేయడం వల్ల స్థానికులకు ఇబ్బందిగా మారిందన్నారు.ఇంత జరుగుతున్నా స్థానిక బిజెపి నేతలు నోరు మెదపక పోవడం విడ్డూరంగా వుందని మంత్రి విమర్శించారు. రైల్వే అధికారులు బస్తీ ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే చర్యలను మానుకోవాలని ఆయన సూచించారు.