తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో బిజెపి నేతలు చెప్పాలి: Talasani

ABN , First Publish Date - 2022-07-02T00:12:26+05:30 IST

నగరంలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న BJP నేతలు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) డిమాండ్ చేశారు.

తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో బిజెపి నేతలు చెప్పాలి: Talasani

హైదరాబాద్: నగరంలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న BJP నేతలు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల BJP ముఖ్యమంత్రులు మూడు రోజుల పాటు నగరానికి వచ్చిన టూరిస్ట్ లుగా ఆయన అభివర్ణించారు.ఈ నెల 2వ తేదీన నగరానికి రానున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో  ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. శుక్రవారం  నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో యశ్వంత్ సిన్హా పాల్గొనే సభ ఏర్పాట్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLA లు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, MLC ప్రభాకర్ లతో కలిసి పరిశీలించారు. 


ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి భారీ బైక్ ర్యాలీతో బేగంపేట, క్యాంప్ ఆఫీస్, రాజ్ భవన్ రోడ్ ల మీదుగా నెక్లెస్ రోడ్ కు చేరుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామరక్ష అని, TRS పార్టీ ప్రభుత్వాన్నే అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అబద్ధాల కోరు BJP ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, BJP కార్పొరేటర్ లు TRS లో చేరడమే ఇందుకు నిదర్శనంగా వారు పేర్కొన్నారు. BJP  రాష్ట్రపతి అభ్యర్థి సొంత గ్రామానికే విద్యుత్ సౌకర్యం లేకపోవడం శోచనీయం అన్నారు. ఆర్మీని ఔట్ సోర్సింగ్ చేయాలనే ఉద్దేశం తోనే అగ్నిపథ్ ను తీసుకొచ్చారని ఆరోపించారు.


కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా అనేకమంది అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో పరేడ్ గ్రౌండ్ లో TRS పార్టీ సభ కోసం అనుమతి కోరితే రాజకీయ పార్టీల సభకు అనుమతించమని చెప్పారని, నేడు BJP సభకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అబద్దాలు మాట్లాడటం మానుకోవాలని హితవుపలికారు. వీలైతే రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ను మంజూరు చేసి ప్రజల మెప్పును పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T00:12:26+05:30 IST