కరోనా నేపధ్యంలో నిరాడంబరంగా గణేష్‌ ఉత్సవాలు- తలసాని

ABN , First Publish Date - 2020-08-08T22:32:59+05:30 IST

కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం గణేష్‌ ఉత్సవాలను ఏకాభిప్రాయంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు

కరోనా నేపధ్యంలో నిరాడంబరంగా గణేష్‌ ఉత్సవాలు- తలసాని

హైదరాబాద్‌: కరోనా నేపధ్యంలో  ఈ సంవత్సరం గణేష్‌ ఉత్సవాలను ఏకాభిప్రాయంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గణేష్‌ఉత్సవాల నిర్వహణ పై మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిపండగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటున్నాని అన్నారు. కరోనా నేపధ్యంలో ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో పలువురు ఉత్సవ సమితి సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 


ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్‌అలీ , విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ పరిపాలనా ప్రిన్సిపల్‌ సె సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, దేవాదాయశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాధ్‌, ముఠాగోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, ప్రకాశ్‌గౌడ్‌, రాజాసింగ్‌, సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ శ్వేతామహంతి, వాసం వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసి కమిషనర్‌లోకేశ్‌కుమార్‌, అడిషనల్‌ డీజీపీ జితేందర్‌, పోలీస్‌కమిషనర్‌ అంజనీ కుమార్‌, మహేశ్‌భగవత్‌, భాగ్యనగర్‌గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌, బాలాపూర్‌గణేష్‌ ఉత్సవ సమితి అఽధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


ఈసందర్హంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. విగ్రహాల ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకూ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వ అన్నిచర్యలు తీసుకుంటుందని అన్నారు. జీహెచ్‌ఎంసి పరిధిలో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తుందన్నారు. కరోనా విజృంభిస్తున్న నే పధ్యంలో ఈ సంవత్సరం గణేష్‌ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలన్న విషయాలను చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అన్నారు. మరో నాలుగు రోజుల్లో మరో సమావేశం నిర్వహించి ఏకాభి ప్రాయంతో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈసందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారికి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. 

Updated Date - 2020-08-08T22:32:59+05:30 IST