ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే కరోనాను తరిమికొట్టొచ్చు

ABN , First Publish Date - 2020-03-26T23:24:55+05:30 IST

ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మహమ్మారిని తరమి కొట్టవచ్చని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే కరోనాను తరిమికొట్టొచ్చు

హైదరాబాద్‌: ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మహమ్మారిని తరమి కొట్టవచ్చని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం ఎర్రగడ్డ రైతుబజార్‌ను జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కరోనావైరస్‌ నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రైతు బజార్‌లో కూరగాయలను ఏ ధరలకు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాపారులకు సూచించారు. గత రెండు రోజులతో పోలిస్తే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం వల్లనే ఇదిసాధ్యమైందని పలువురు కొనుగోలు దారులు మంత్రికి వివరించారు. మార్కెట్‌లో పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించక పోవడం పట్ల మంత్రి మార్కెటింగ్‌శాఖ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సోకడానికి ముఖ్యంగా పారిశుద్ధ్యం నిర్వహణ లోపం కూడా ఒకటని, దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ పై సిబ్బందిని నియమించుకోవాలని  ఆదేశించారు. ఒక్కో వ్యాపారికి మధ్యన దూరం పాటించాలన్నారు. కూరగాయల ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం యూసుఫ్‌గూడలోని రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సూపర్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న కూరగాయలు,నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్‌ ధరలకు, సూపర్‌ మార్కెట్‌లో కూరగాయల ధరలు అధికంగా  ఉండడం పట్ల సూపర్‌ మార్కెట్‌ సిబ్బందిని మంత్రి  మందలించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యాజమాన్యాలు లాభాపేక్ష మరిచి సామాజిక దృక్పథంతో వ్యవహరించి ప్రజలకు సాధారణ ధరలకే కూరగాయలను విక్రయించాలని ఆదేశించారు. శ్రీనికేతన్‌ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గోపీనాధ్‌ ,కార్పొరేటర్‌ మన్నె కవితతో కలిసి పర్యటించి కాలనీ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు కరోనా వైరస్‌ నివారణకు పలు సూచనలతో కాలనీ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లో వాహన దారులతో మాట్లాడారు. అవసరమైతేనే ఇండ్లలో నుంచి బయటకు రావాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిందన్నారు.  

Updated Date - 2020-03-26T23:24:55+05:30 IST