నగరంలో మంత్రి సురేష్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-08-07T06:37:59+05:30 IST

రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ నగరంలో శనివారం తనిఖీలు నిర్వహించారు.

నగరంలో మంత్రి సురేష్‌ తనిఖీలు
పారిశుధ్య పనులకు వినియోగిస్తున్న చీపురును పరిశీలిస్తున్న మంత్రి సురేష్‌

పారిశుధ్య నిర్వహణ పనులు పరిశీలన

పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేద ని పారిశుధ్య కార్మికులు ఫిర్యాదు

రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని క్లాప్‌ వాహన డ్రైవర్లు ఆవేదన

సమస్యల పరిష్కారానికి అమాత్యుని హామీ


విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ నగరంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి నోవాటెల్‌ హోటల్‌లో బస చేసిన ఆయన శనివారం ఉదయం ఆరు గంటలకు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారితో కలిసి కలెక్టరేట్‌ జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ వున్న పారిశుధ్య కార్మికుల మస్తర్‌ పాయింట్‌ను పరిశీలించి హాజరు, ఎవరెకక్కడ విధులు నిర్వహిస్తున్నారనేది ఆరా తీశారు. అనంతరం రోడ్లు శుభ్రం చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. కార్మికులకు ఇటీవలే ప్రభుత్వం వేతనాలను పెంచిందని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని సూచించారు. అనంతరం పారిశుధ్య కార్మికురాలి చేతిలో వున్న చీపురు తీసుకుని స్వయంగా రోడ్డు ఊడ్చారు. చీపుర్లు సరిగా లేకుంటే ఎంత పనిచేసినా ఆశించిన స్థాయిలో రోడ్లు శుభ్రం కావని, అలాకాకుండా ఫ్లాట్‌గా వుండే చీపుర్లను అందజేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. తమకు గ్లౌజ్‌లు, మాస్కులు, యాప్రాన్లు, చీపుర్లు, సబ్బులు, కొబ్బరినూనె వంటివి అందడం లేదని కార్మికులు కొంతమంది మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  తక్షణం వాటిని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. అక్కడి నుంచి అఫీషియల్‌ కాలనీ వరకూ నడుచుకుంటూ వెళ్లి అక్కడ రోడ్డుపై వున్న క్లాప్‌ వాహనాన్ని పరిశీలించారు. వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడాన్ని గుర్తించి డ్రైవర్‌ను మందలించారు. మంత్రి పర్యటన విషయం తెలిసి చుట్టుపక్కల క్లాప్‌ వాహనాలతో చెత్తసేకరిస్తున్న డ్రైవర్లు అందరూ అక్కడకు చేరుకుని తమకు రెండు నెలలుగా జీతాలు అదండం లేదని ఫిర్యాదు చేశారు. వాహనాల డ్రైవర్లకు సకాలంలో జీతాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి చినవాల్తేరు వెళ్లి రోడ్లను పరిశీలించారు. రోడ్లపై గుంతలు వుండడాన్ని గమనించి తక్షణం మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ఉషోదయ జంక్షన్‌కు చేరుకుని అక్కడ యూజీడీ నిర్వహణ పనులు చేస్తున్న రోబోను పరిశీలించారు. చిల్లర వ్యాపారులు, హోటళ్లను పరిశీలించి ఆహార వ్యర్థాలు, చెత్తను కచ్చితంగా డస్ట్‌బిన్లలోనే వేయాలని ఆదేశించారు. ఒంటరి మహిళ ఒకరు మంత్రి వద్దకు వెళ్లి తనకు పింఛన్‌ రావడం లేదని ఫిర్యాదు చేయడంతో, తక్షణం ఆమెకు పింఛన్‌ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డు డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో భాగంగా నగరాన్ని మొక్కలతో సుందరీకరించాలని హార్చీకల్చర్‌ అధికారులను ఆదేశించారు. సమీపంలో నిర్మాణంలో వున్న భవనం వద్దకు వెళ్లి ప్లాన్‌, నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? పరిశీలించారు. నగరంలో అక్రమ నిర్మాణాలు జరిగితే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యటనలో మంత్రి వెంట అదనపు కమిషనర్‌ వై.శ్రీనివాసరావు, ప్రధాన వైద్యాధికారి కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, చీఫ్‌ ఇంజనీర్‌ రవికృష్ణరాజు, చీఫ్‌ సిటీప్లానర్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆస్తి పన్ను ఆధారంగా చెత్త పన్ను?

జీవీఎంసీ యోచన

ఈ నెల 10న కౌన్సిల్‌ సమావేశంలో చర్చ

కనిష్ఠంగా అర్ధ సంవత్సరానికి రూ.200లోపు ఆస్తి పన్ను కట్టే ఇళ్లకు రూ.20

గరిష్ఠంగా రూ.4,001, అంతకంటే ఎక్కువ కట్టేవారికి రూ.120


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆస్తి పన్ను ఆధారంగా చెత్త పన్ను (యూజర్‌ చార్జీ) వసూలు చేయాలని మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) భావిస్తోంది. ఈ అంశాన్ని ఈ నెల పదో తేదీన జరగనున్న కౌన్సిల్‌ సమావేశం ఎజెండాలో చేర్చింది. ప్రస్తుతం మురికివాడల్లో రూ.60, ఇతర ప్రాంతాల్లో నివాసాలకు రూ.120 చొప్పున యూజర్‌ చార్జీలను వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో అధికార పార్టీ నేతలు పునరాలోచనలో పడ్డారు. గతంలో మాదిరిగా కాకుండా ఆస్తి పన్ను అర్ధ సంవత్సరానికి రూ.200లోపు కట్టే ఇళ్లకు రూ.20, రూ.201-రూ.1000 మధ్య కట్టే వారికి రూ.50, రూ.1,001-2000 వరకూ కట్టే వారికి రూ.60, రూ.2,001-4,000 మధ్య కట్టే వారికి రూ.110, రూ.4,001, అంతకంటే ఎక్కువ కట్టేవారికి రూ.120 చొప్పున విధించాలని ప్రతిపాదించారు. జీవీఎంసీ పరిధిలో సగానికిపైగా నివాసాలకు అర్ధ సంవత్సరానికి రూ.2,000లోపే ఆస్తి పన్ను చెల్లిస్తున్నందున అధికశాతం మందికి ఊరట కలుగుతుందని పాలకవర్గం పెద్దలు పేర్కొంటున్నారు. కాగా కౌన్సిల్‌ సమావేశం కోసం ఇప్పటికే ఆరు అంశాలతో ప్రధాన అజెండా తయారుచేసి సభ్యులకు అందజేయగా, తాజాగా మరో ఆరు అంశాలతో సప్లిమెంటరీ అజెండాను రూపొందించారు. అందులో ఆస్తి పన్ను ఆధారంగా చెత్త యూజర్‌ చార్జీల వసూలు ప్రతిపాదన ఉంది. అలాగే కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులోని బయోగ్యాస్‌ ప్లాంట్‌ లీజు గత ఏడాది ఆగస్టు నాటికి ముగియడంతో 2024 వరకూ పొడిగించాలని నిర్ణయించారు. ఇంకా భీమిలి మండలం కొత్తవలస సర్వే నంబర్‌ 73లోని 50 ఎకరాల భూమి వీఎంఆర్‌డీఏకు బదలాయింపు, 41వ వార్డు జ్ఞానాపురంలోని ఎర్రిగెడ్డ పూడికతీత పనులకు మేయర్‌ ఆమోదాన్ని అంగీకరించడం, జీవీఎంసీ పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు విద్యా శాఖకు అప్పగింత, ఎనిమిది జోన్ల కమిషనర్లకు రూ.93.37 లక్షలతో ఎనిమిది బొలేరో వాహనాల కొనుగోలు వంటి అంశాలు ఉన్నాయి. 


టెట్‌కు 85.15 శాతం హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2022 (టెట్‌) శనివారం నగరంలోని పది కేంద్రాల్లో ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 6,096 మందికిగాను 5,191 మంది (85.15 శాతం) హాజరుకాగా, 905 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 3,081 మందికిగాను 2,627 మంది పరీక్ష రాయగా 454 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం  3,015 మందికిగాను 2,564 మంది పరీక్ష రాయగా, 451 మంది గైర్హాజరయ్యారు. కాగా డీఈవో ఎల్‌.చంద్రకళ నగరంలో ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు. శనివారం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆమె తెలిపారు. 

Updated Date - 2022-08-07T06:37:59+05:30 IST